ఆర్టీసీ ఛార్జీలు పెంచి లూటీ చేస్తున్న జగన్‌

సీఎం జగన్‌ మూడేళ్ల పాలనలో ఆర్టీసీ ఛార్జీలను మూడు సార్లు పెంచడంపై తెదేపా శ్రేణులు ధ్వజమెత్తాయి. తద్వారా ప్రజలను లూటీ చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు

Updated : 03 Jul 2022 07:09 IST

రాష్ట్రవ్యాప్తంగా 388 మండలాల్లో తెదేపా నిరసన కార్యక్రమాలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సీఎం జగన్‌ మూడేళ్ల పాలనలో ఆర్టీసీ ఛార్జీలను మూడు సార్లు పెంచడంపై తెదేపా శ్రేణులు ధ్వజమెత్తాయి. తద్వారా ప్రజలను లూటీ చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ తెదేపా అధినాయకత్వం పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, మచిలీపట్నం, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట, కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల, నరసాపురం లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో సుమారు 388 మండలాల్లో ఆందోళనలు జరిగాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ ప్రయాణికులకు కరపత్రాలు పంపిణీ చేసిన తెదేపా కార్యకర్తలు వైకాపా ప్రభుత్వం బాదుడే-బాదుడు తీరును వివరించారు. తాజాగా ఛార్జీల పెంపుతో సుమారు 65 లక్షల మందిపై ఏటా సుమారు రూ.మూడు వేల కోట్ల వరకు అదనపు భారం పడుతుందని విమర్శించారు. ఛార్జీలు తగ్గించే వరకు తెదేపా పోరాటం ఆగదని ఆర్టీసీ బస్టాండ్ల వద్ద నినదించారు. నిత్యావసర ధరలు, విద్యుత్తు ఛార్జీల పెంపు, చెత్త పన్నులతో రాష్ట్రంలో సామాన్యుడు బతకలేని పరిస్థితి నెలకొందన్నారు. ఆర్టీసీ ఆస్తులను కొట్టేయడానికి ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు బెందాళం అశోక్‌, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, అంగర రామ్మోహన్‌, దొరబాబు, పలువురు తెదేపా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

బస్సులను కడిగి నిరసన
పాలకొల్లు, న్యూస్‌టుడే: ఆర్టీసీ ఛార్జీలను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ శనివారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు బస్టాండ్‌లో బస్సులను కడిగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల మాట్లాడుతూ మూడేళ్లలో మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కిందన్నారు. పల్లెవెలుగు టికెట్‌ ధరలతో పాటు, విద్యార్థుల పాసుల ఛార్జీలను సైతం పెంచారంటూ ఎమ్మెల్సీ అంగర మండిపడ్డారు. తెదేపా శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఛార్జీలు తగ్గించాలని నినాదాలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని