Bihar Politics: నీతీశ్‌.. కూటములు కట్టే ఇంజినీర్‌!

బిహార్‌ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన జనతాదళ్‌- యునైటెడ్‌ (జేడీ-యు) అగ్రనేత నీతీశ్‌కుమార్‌కు రాజకీయాల్లో మంచిపేరే ఉన్నా తరచూ కూటములు మారుస్తుండడంపై మాత్రం విమర్శలు ఎదుర్కొంటుంటారు. సోషలిస్టు నేతల స్ఫూర్తితో తొలినాళ్లలో

Updated : 10 Aug 2022 06:59 IST

ఎన్డీయే, మహా కూటమి మధ్య దోబూచులాట

ఒకసారి దోస్తీ-మరోసారి కుస్తీ

ఎమ్మెల్సీగానే ఎనిమిదోసారి సీఎం పీఠం మీదికి

పట్నా: బిహార్‌ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన జనతాదళ్‌- యునైటెడ్‌ (జేడీ-యు) అగ్రనేత నీతీశ్‌కుమార్‌కు రాజకీయాల్లో మంచిపేరే ఉన్నా తరచూ కూటములు మారుస్తుండడంపై మాత్రం విమర్శలు ఎదుర్కొంటుంటారు. సోషలిస్టు నేతల స్ఫూర్తితో తొలినాళ్లలో వారితో కలిసి తిరిగిన ఆయన మొదట జనతా పార్టీలో చేరారు. తర్వాత వివిధ కారణాల వల్ల వేరే పార్టీలను, కూటములను ఎంచుకున్నారు. ఒకసారి ఎన్డీయేలో, మరోసారి మహా కూటమిలో కొనసాగుతూ తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నట్టుగా కూటములు మార్చడంలోనూ ఆయనది విలక్షణమే. 2017లో ఎన్డీయేలో చేరడానికి మహా కూటమిని వీడిన ఆయన ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నారు. ఏడుసార్లు సీఎం పగ్గాలు చేపట్టినా.. ఈ కాలంలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేదు.. ఎమ్మెల్సీగానే కొనసాగారు. మహాకూటమి మద్దతుతో ఇప్పుడు ఎనిమిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమయ్యారు.

తొలిసారి సీఎంగా ఎనిమిది రోజులే

నీతీశ్‌ ఇప్పటివరకు ఏడుసార్లు బిహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. తొలిసారి 2000లో సీఎం అయినప్పుడు ఆయన ఏ సభలోనూ సభ్యుడు కాదు. అసెంబ్లీలో తగిన బలం లేకపోవడంతో ఎనిమిది రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. 2005, 2010, 2015, 2017, 2020లలో సీఎంగా బాధ్యతలు నిర్వహించి తిరుగులేని నేతగా కొనసాగారు. ముఖ్యమంత్రిగా ఉన్న ఏడుసార్లూ ఆయన ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచీ ప్రాతినిధ్యం వహించకపోవడం గమనార్హం. 1977లో నలంద జిల్లాలోని హర్నాట్‌ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. 1985లో అదే స్థానం నుంచి బరిలో దిగి రికార్డు మెజార్టీతో విజయదుందుభి మోగించారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం అదే చివరిసారి. రాజకీయాల్లోకి రాకముందు ఆయన బిహార్‌ విద్యుత్‌ సంస్థలో ఇంజినీర్‌గా పనిచేశారు. జనతా పార్టీలో చీలికల తర్వాత జేడీ(యు)ను నెలకొల్పారు.

నైతిక బాధ్యతతో రాజీనామా

2013లో భాజపాతో ఉన్న స్నేహాన్ని తెంచుకొని నీతీశ్‌ అందరినీ ఆశ్చర్యపరిచారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరి పోరుకు దిగారు. మోదీ ప్రభంజనం కారణంగా జేడీయూకి ఘోర పరాభవం ఎదురవ్వడంతో నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి తప్పుకొన్నారు. అప్పట్లో జేడీయూలో ఉన్న జితిన్‌ రాం మాంఝీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2015 ఫిబ్రవరిలో జేడీయూ నుంచి మాంఝీ బహిష్కరణకు గురికావడంతో నీతీశ్‌ నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో మహాకూటమిగా బరిలోకి దిగి విజయం సాధించిన ఆయన ఐదోసారి సీఎం అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తేజస్వీ యాదవ్‌ను అవినీతి ఆరోపణలతో తొలగించడంపై ఆర్జేడీ తీవ్ర అభ్యంతరం చెప్పింది. 2017 జులైలో సీఎం పదవికి నీతీశ్‌ రాజీనామా చేశారు. దీంతో మహా కూటమి చీలిపోయింది. మళ్లీ ఎన్డీయేతో దోస్తీ కట్టిన నీతీశ్‌ కొద్ది గంటల్లోనే సీఎం పీఠం దక్కించుకున్నారు. 2018లో మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ పదవీకాలం 2024 వరకు ఉంది. 2020 ఎన్నికల్లో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించినా.. జేడీయూ మాత్రం భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏడోసారి సీఎంగా నీతీశ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. అనూహ్యంగా ఇప్పుడు కూటమి మరోమారు విచ్ఛిన్నమైంది.

అసెంబ్లీకి అందుకే పోటీ చేయడం లేదు!

ప్రజలను నేరుగా ఎదుర్కొనేందుకు నీతీశ్‌ భయపడుతున్నారని, శాసనమండలి నుంచి ఎన్నికవ్వడమే సురక్షితమని ఆయన భావిస్తున్నారని విమర్శకులు అంటుంటారు. దీనికి నీతీశ్‌ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. తాను ఒక్క స్థానానికే పరిమితం కావాలనుకోవడంలేదని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని చెప్పుకొచ్చారు. జనతాదళ్‌లో ఉన్నప్పుడు తనకు సీనియర్‌ అయిన లాలూప్రసాద్‌ యాదవ్‌ను బిహార్‌ సీఎంని చేయడంతో 1990లో నీతీశ్‌ పేరు దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. లాలూను అప్పట్లో ఆయన బడే భాయ్‌ (పెద్దన్నయ్య)గా పిలిచేవారు. అలాంటి లాలూతోనే 1994లో విభేదించి, సోషలిస్ట్‌ పార్టీ సీనియర్‌ నేత జార్జి ఫెర్నాండెజ్‌తో కలిసి సమతా పార్టీని నెలకొల్పారు. 2003లో అది జేడీ(యూ)లో విలీనమైంది. లోక్‌సభ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నరేంద్రమోదీని నియమిస్తున్నట్లు 2013లో భాజపా ప్రకటించడంతో ఎన్డీయే నుంచి నీతీశ్‌ విడిపోయారు. 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి మహా కూటమిని ఏర్పాటుచేశారు.


ప్రధాని పదవికి పోటీ పడతారా?

2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల తరఫున ప్రధాని అభ్యర్థిగా నీతీశ్‌ బరిలో దిగుతారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రధాని అయ్యేందుకు అన్ని అర్హతలు ఆయనకు ఉన్నాయని జేడీ(యు) జాతీయ పార్లమెంటరీ బోర్డు అధ్యక్షుడు ఉపేంద్ర కుశ్వాహా పట్నాలో చెప్పారు. ఆర్జేడీ నేత శరద్‌ యాదవ్‌కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు.


ఆరుసార్లు లోక్‌సభకు

1989, 1991, 1996, 1998, 1999, 2004 సంవత్సరాల్లో వరుసగా ఆరుసార్లు నీతీశ్‌ లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేంద్రమంత్రిగా సేవలందించారు. 2005 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా-జేడీయూ కూటమి గెలుపొందింది. దీంతో నీతీశ్‌ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి అయిన వ్యక్తి శాసనసభలో, లేదా శాసనమండలిలో సభ్యుడు కానట్లయితే ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లోపు ఆ రెండు సభల్లో ఏదో ఒకదానికి ఎన్నికవ్వాలని రాజ్యాంగం చెబుతోంది. దీంతో 2006లో నీతీశ్‌ శాసనమండలికి ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ పదవీకాలం 2012 వరకు ఉండగానే 2010 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా-జేడీయూ కూటమి మరోసారి అధికారంలోకి రాగా.. ఆయన వరుసగా మూడోసారి సీఎంగా ప్రమాణం చేశారు. 2012లో ఎమ్మెల్సీగా తన పదవీకాలం ముగియడంతో మళ్లీ మండలికే ఎన్నికయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు