ఎమ్మెల్యే కోనేటికి చేదు అనుభవం

తిరుపతి జిల్లా సత్యవేడు మండలం చెరివి పంచాయతీ పరిధిలోని మాదనపాళెంలో బుధవారం జరిగిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి

Published : 11 Aug 2022 08:53 IST

సత్యవేడు, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా సత్యవేడు మండలం చెరివి పంచాయతీ పరిధిలోని మాదనపాళెంలో బుధవారం జరిగిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి వైకాపాకు చెందిన ఎంపీటీసీ సభ్యుడి నుంచి చేదు అనుభవం ఎదురైంది. గ్రామ పాఠశాల ఆవరణలో నిర్వహించిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతుండగా చెరివి ఎంపీటీసీ సభ్యుడు రామయ్య  సమస్యలు చెప్పుకునేందుకు మైక్‌ ఇవ్వాలని పలుమార్లు కోరారు. ఎమ్మెల్యే మాట్లాడిన తర్వాత ఆయనకు మైక్‌ ఇచ్చారు. గ్రామ సమస్యలు గురించి మాట్లాడుతుండగా ఎమ్మెల్యే ఆదిమూలం వేదికపై నుంచి కిందకు దిగి వెళ్లడంతో పాటు వేదికపై ఉన్న ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యుడు, పలువురు నాయకులు ఆయన వెంట వెళ్లారు. ఆగ్రహించిన రామయ్య తన వర్గంతో కలిసి ప్లకార్డులు, డప్పులతో మాదనపాళెం వీధి వీధి తిరుగుతూ.. శ్రీసిటీతో కుమ్మక్కై పేద ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని.. ఎమ్మెల్యే గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎంపీటీసీ సభ్యుడిని, ఆయన వర్గాన్ని పోలీసులు అడ్డుకోవడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే పోలీసు పహారాతో మాదనపాళెం సమీపం ఎస్సీ కాలనీ, చెరివి, చిగురపాళెం గ్రామాల్లో పర్యటించి కార్యక్రమం పూర్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని