ఈవీఎంల దుర్వినియోగంపై ఉమ్మడి పోరు

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను దుర్వినియోగం చేస్తోందనీ, ధన బలం ప్రదర్శిస్తోందని కాంగ్రెస్‌, తెరాస సహా 11 విపక్షాలు ఆరోపించాయి. దీంతోపాటు మీడియానూ దుర్వినియోగం చేస్తున్న తీరుపై సంయుక్తంగా పోరాడాలని

Published : 14 Aug 2022 06:06 IST

కాంగ్రెస్‌, తెరాస సహా 11 విపక్షాల నిర్ణయం

ధనబలంపైనా ఉద్యమానికి తీర్మానం

దిల్లీ: కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను దుర్వినియోగం చేస్తోందనీ, ధన బలం ప్రదర్శిస్తోందని కాంగ్రెస్‌, తెరాస సహా 11 విపక్షాలు ఆరోపించాయి. దీంతోపాటు మీడియానూ దుర్వినియోగం చేస్తున్న తీరుపై సంయుక్తంగా పోరాడాలని తీర్మానం చేశాయి. మెషీన్‌, మనీ, మీడియా అనే ఈ మూడు ‘ఎం’ల విషయంలో కేంద్రం తీరు ప్రజాస్వామ్యానికి తీవ్ర సవాలుగా నిలుస్తోందని పేర్కొన్నాయి. ఈ మేరకు దిల్లీలో కాంగ్రెస్‌, సీపీఎం, ఎస్పీ, బీఎస్పీ, సీపీఐ, ఎన్సీపీ, తెరాస, ఆర్జేడీ, ఆర్‌ఎల్‌డీ, వెల్ఫేర్‌ పార్టీ, స్వరాజ్‌ ఇండియా పార్టీల నేతలు శనివారం సమావేశమై మూడు తీర్మానాలను ఆమోదించారు. మూడు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మొదటి తీర్మానంలో భాగంగా ఈవీఎంలు, వీవీప్యాట్‌ల ఓట్ల లెక్కింపు ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా లేదని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రతి ఓటరు తాము ఓటు వేశామో లేదో ధ్రువీకరించుకునేలా ఓ విధానం ఉండాలని నేతలు పేర్కొన్నారు. ఓటింగ్‌ ప్రక్రియను ధ్రువీకరించడానికి లేదా ఆడిట్‌ చేయడానికి సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ స్వతంత్రంగా ఉండేలా మార్పులు చేయాలని డిమాండ్‌ చేశారు. భారీ ధనబలం, నేరస్థుల కండబలం దేశ ఎన్నికల సమగ్రతను ఏవిధంగా నాశనం చేస్తున్నాయో రెండో తీర్మానంలో భాగంగా నేతలు ప్రస్తావించారు. అభ్యర్థుల ఖర్చుకు పరిమితి ఉన్నా.. రాజకీయ పార్టీల ఖర్చుకు అది లేదని, ఇది ప్రమాదకరమైన విషయమని తెలిపారు.

ఎలక్టోరల్‌ బాండ్లు నిలిపివేయాలి

రాజ్యసభను దాటవేయడానికి ద్రవ్యబిల్లు మార్గాన్ని ఉపయోగించి ప్రభుత్వం ఎలక్టోరల్‌ బాండ్‌ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఇది అపారదర్శకతను పెంచిందని, ఎన్నికల రాజకీయాల్లో డబ్బు పాత్రను ఏకీకృతం చేసిందని పార్టీలు పేర్కొన్నాయి. ప్రస్తుత రూపంలో ఉన్న ఎలక్టోరల్‌ బాండ్ల పథకాన్ని వెంటనే నిలిపివేయాలని నేతలు డిమాండ్‌ చేశారు. విపరీతమైన ఇంటర్నెట్‌ వినియోగంతో భారత్‌లో మీడియా విభాగం పెను మార్పులకు గురైందని మూడో తీర్మానంలో భాగంగా నేతలు చర్చించారు. ‘‘దురదృష్టవశాత్తు కమ్యూనికేషన్‌ టెక్నాలజీ, మీడియా సాధనాల కారణంగా తప్పుడు సమాచారం, ద్వేషపూరిత అంశాలు ట్వీట్ల రూపంలో బయటకొస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఆన్‌లైన్‌లో నకిలీ వార్తలను అరికట్టడంలో ఎన్నికల సంఘం విఫలమైంది’’ అని నేతలు ఆరోపించారు. మూడు అంశాలపై భాజపాతో పోరాటానికి సిద్ధం కావాలని తీర్మానం చేశారు. సమావేశంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ అగ్రనేత డి.రాజా, తెరాస నుంచి సురేశ్‌రెడ్డి, ఎన్సీసీ నేత జితేందర్‌ అవధ్‌, బీఎస్పీ నేత దినేశ్‌ అలీ, సమాజ్‌వాదీ నుంచి ఘనశ్యామ్‌ తివారి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని