మతపరమైన రిజర్వేషన్లు తొలగిస్తాం

తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తే ముస్లింలకు ఇస్తున్న మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేసి, ఆ మేరకు గిరిజనులకు పెంచుతామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. పార్లమెంటుకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలనడం మంచి

Published : 27 Sep 2022 04:57 IST

 బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదు

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి

ఈనాడు, దిల్లీ: తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తే ముస్లింలకు ఇస్తున్న మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేసి, ఆ మేరకు గిరిజనులకు పెంచుతామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. పార్లమెంటుకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలనడం మంచి ప్రతిపాదనేనని, ఆ విషయాన్ని తాను కేంద్ర కేబినెట్‌ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. సోమవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. విభజన సమస్యలపై మంగళవారం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల అధికారుల సమావేశం జరుగుతున్న విషయం గురించి విలేకరులు అడిగినప్పుడు.. సమస్యలను రెండు రాష్ట్రాలు కూర్చొని పరిష్కరించుకోవాలని సూచించారు.

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు ఎవరికీ సాధ్యంకాదని కిషన్‌రెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘కేంద్రం అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోతే తానే పెడతానని కేసీఆర్‌ 2018 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. ఇంతవరకూ ఆ పని ఎందుకు చేయలేదో చెప్పాలి. అక్కడున్న ముడి సరకు పరంగా చూస్తే ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి ఇనుప ఖనిజం తీసుకొచ్చి ఇక్కడ తయారుచేస్తే లాభదాయకం కాదు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను గుజరాత్‌కు తన్నుకుపోతున్నారన్న వాదనల్లో నిజం లేదు. కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీకి బదులు వ్యాగన్‌ ఓవర్‌హాలింగ్‌ ఫ్యాక్టరీ మంజూరు చేశాం. దానికి 2018 నుంచి వెంటపడితే రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల క్రితం 150 ఎకరాల భూమి ఇచ్చింది. దానికి ఇంతవరకూ అప్రోచ్‌ రోడ్లు లేవు. ఇతర రైల్వే ప్రాజెక్టులకూ భూమి కేటాయించలేదు. కేసీఆర్‌కు సమాఖ్య వ్యవస్థపై నమ్మకం ఉంటే అన్నీ సిద్దిపేటకే ఎందుకు తీసుకెళ్తున్నారు. మిగిలిన నియోజకవర్గాలకు ఎందుకు ఇవ్వడంలేదో చెప్పాలి’’ అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం దిల్లీలో ఇండియాగేటు వద్ద బతుకమ్మ పండుగ నిర్వహించబోతున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని