డబుల్‌ ఇంజిన్‌ సర్కారు వల్లే గుజరాత్‌ సత్వరాభివృద్ధి

కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి పరుగులుపెడుతుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో సూరత్‌కు విమానాశ్రయాన్ని, మెట్రో ప్రాజెక్టును మంజూరు చేయించుకోవడానికి

Published : 30 Sep 2022 05:33 IST

సూరత్‌, భావ్‌నగర్‌ రోడ్‌ షోలలో ప్రధాని మోదీ

సూరత్‌: కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి పరుగులుపెడుతుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో సూరత్‌కు విమానాశ్రయాన్ని, మెట్రో ప్రాజెక్టును మంజూరు చేయించుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పుడు అటువంటి సమస్యలేదని గత కొన్నేళ్లుగా గుజరాత్‌ సత్వరాభివృద్ధి చెందుతుందంటే అందుకు ‘డబుల్‌ ఇంజిన్‌ సర్కారే’ కారణమని ఆయన తెలిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గురువారం తొలుత సూరత్‌ నగరంలో, ఆ తర్వాత భావ్‌నగర్‌లలో నిర్వహించిన రోడ్‌ షోలలో పాల్గొన్నారు. కొత్తగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలలు, సైన్స్‌ మ్యూజియం, గ్రంథాలయాలు, వైద్య విద్యార్థులకు వసతి గృహం, మురుగునీటి శుద్ధి కేంద్రం, అగ్నిమాపక కేంద్రం తదితరాలను ఈ సందర్భంగా ప్రారంభించారు. సూరత్‌లో రూ.3,400 కోట్లు, భావ్‌నగర్‌లో రూ.6వేల కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటిలో సూరత్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్‌ సమీపాన ఉన్న ఖజోద్‌ గ్రామంలోని 700 హెక్టార్లలో నిర్మించదలచిన డ్రీమ్‌ సిటీ ప్రాజెక్టు తొలి దశ పనులు కూడా ఉన్నాయి. డ్రీమ్‌ (డైమండ్‌ రీసెర్చ్‌ అండ్‌ మర్కెంటైల్‌) సిటీ...వజ్రాల వ్యాపారానికి సురక్షితమైన, సౌకర్యవంతమైన కేంద్రంగా ఉంటుందని ప్రధాని తెలిపారు. సూరత్‌ నుంచి వస్త్రోత్పత్తులను తన లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసికి రవాణా చేసేందుకు ప్రత్యేక రైళ్లను నడిపే యోచనలో రైల్వే శాఖ ఉందని వెల్లడించారు. అధికారం..ప్రజలకు సేవ చేసేందుకు ఉపయోగపడే సాధనమని పేర్కొన్నారు. భావ్‌నగర్‌లో ప్రధాని పర్యటన శుక్రవారం కూడా కొనసాగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని