BRS: భారత్‌ రాష్ట్ర సమితి

తెరాస స్థానంలో ఏర్పాటయ్యే పార్టీ పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేశారు. దాదాపు వందకు పైగా పేర్లను పరిశీలించిన అనంతరం ఆయన ఈ పేరును మంగళవారం రాత్రి ఎంపిక చేశారు.

Updated : 05 Oct 2022 07:11 IST

జాతీయ పార్టీ పేరు ఖరారు చేసిన సీఎం కేసీఆర్‌
నేడు తెరాస సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం
ప్రత్యేక ఆహ్వానితులుగా కుమారస్వామి, తిరుమవలవన్‌
హైదరాబాద్‌లో పెద్దఎత్తున కటౌట్లు, హోర్డింగులు
ఈనాడు - హైదరాబాద్‌

తెరాస స్థానంలో ఏర్పాటయ్యే పార్టీ పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేశారు. దాదాపు వందకు పైగా పేర్లను పరిశీలించిన అనంతరం ఆయన ఈ పేరును మంగళవారం రాత్రి ఎంపిక చేశారు. భారత్‌ రాష్ట్ర సమితి పేరు తెలుగు వారితో పాటు హిందీలోనూ అందరికీ అర్థమవుతుందని, హిందీలో భారతదేశ సమితి అనే అర్థం వస్తుందనే ఉద్దేశంతో ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పేరు దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లిందని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగే సర్వసభ్య సమావేశంలో పేరు మార్పుపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. 283 మంది సభ్యులు    ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతారు. మధ్యాహ్నం 1.19 గంటలకు తీర్మానంపై కేసీఆర్‌ సంతకం చేస్తారు. సభ్యులు ఆమోదించిన తీర్మానంపై ఆయన ప్రకటన చేస్తారు. సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,  జేడీఎస్‌ నేత కుమారస్వామి, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధ్యక్షుడు, ఎంపీ తిరుమవలవన్‌ తదితరులు హాజరు కానున్నారు. తెరాస సర్వసభ్య సమావేశాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్‌ మంగళవారం ప్రగతిభవన్‌లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, మహమూద్‌ అలీ, పార్లమెంటరీ పార్టీ నేత కేకే, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ సభాపతి మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీర్మానం ప్రతిపాదన, ఆమోదం, ఎవరెవరు ప్రసంగించాలన్న అంశాలను ఖరారు చేశారు.

గురువారం దిల్లీకి తెరాస బృందం

తెరాస స్థానంలో భారత్‌ రాష్ట్ర సమితిగా పార్టీ పేరు మార్పు నిర్ణయంపై చేసిన తీర్మానం ప్రతితో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, పార్టీ తెలంగాణ భవన్‌ కార్యాలయ ఇన్‌ఛార్జి శ్రీనివాస్‌రెడ్డి గురువారం దిల్లీకి వెళ్తారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి పార్టీ పేరు మార్పుపై చేసిన తీర్మానానికి ఆమోదం కోరుతూ అఫిడవిట్‌ సమర్పిస్తారు. దానిపై కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీచేస్తుంది. పార్టీ పేరుపై అభ్యంతరాలుంటే తెలిపేందుకు నెల రోజుల గడువు ఇస్తుంది. ఏవీ రాకపోతే దాన్ని ఆమోదిస్తుంది.

కుమారస్వామి బృందానికి కేటీఆర్‌ స్వాగతం

తెరాస సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, మాజీ మంత్రి రేవణ్న, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్‌ నేతలు మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. వారికి బేగంపేట విమానాశ్రయంలో మంత్రి కేటీఆర్‌, శాసనసభ విప్‌ బాల్క సుమన్‌, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ తదితరులు స్వాగతం పలికారు. వీసీకే పార్టీ నేత తిరుమవలవన్‌ మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయనకు విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి స్వాగతం పలికారు.

సమావేశానికి ఏర్పాట్లు

బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభావేదికను సిద్ధం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రత్యేక ఆహ్వానితులకు కల్పించిన వసతులను ఎమ్మెల్సీ మధుసూదనాచారి, తెరాస శాసనసభాపక్ష కార్యదర్శి రమేశ్‌రెడ్డి, తెలంగాణ భవన్‌ ఇన్‌ఛార్జి శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. ఆహ్వానితులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదని ఈ సందర్భంగా నేతలు తెలిపారు.


హైదరాబాద్‌లో భారీగా కటౌట్లు

కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన చేయనున్న నేపథ్యంలో తెలంగాణ భవన్‌ను భారీగా అలంకరించారు. భవన్‌ చుట్టుపక్కలా, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జాతీయ పార్టీని స్వాగతిస్తూ పెద్దఎత్తున ఫ్లెక్సీలు, కటౌట్లను మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితర నేతలు ఏర్పాట్లు చేశారు. కేసీఆర్‌ బుధవారం మధ్యాహ్నం ప్రకటన చేసిన వెంటనే తెలంగాణ భవన్‌తో పాటు హైదరాబాద్‌ నగరంలోనూ, రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. భారత్‌ రాష్ట్ర సమితిగా పార్టీ పేరు మార్పుపై కేసీఆర్‌ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts