ఇటువైపు మోదీ...అటు ఎవరు?

సాధారణంగా రెండు పార్టీల మధ్యే ఎన్నికల పోరు జరిగే గుజరాత్‌లో ఈ దఫా ముక్కోణపు పోటీకి తెరలేచింది. కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఆప్‌ రంగంలోకి దిగటంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

Updated : 04 Nov 2022 10:42 IST

గుజరాత్‌లో వరుసగా ఏడోసారి విజయంపై భాజపా గురి
నాయకత్వ లేమితో కాంగ్రెస్‌ సతమతం
ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఆప్‌ ప్రయత్నం
ఈనాడు - దిల్లీ

సాధారణంగా రెండు పార్టీల మధ్యే ఎన్నికల పోరు జరిగే గుజరాత్‌లో ఈ దఫా ముక్కోణపు పోటీకి తెరలేచింది. కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఆప్‌ రంగంలోకి దిగటంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. త్రిముఖ పోరులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గతంలోకంటే ఏమైనా భిన్నంగా ఉంటాయా అనే విశ్లేషణ మొదలైంది.


నరేంద్ర-భూపేంద్ర...

2017 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 49.05% ఓట్లతో 99 సీట్లు, కాంగ్రెస్‌ 41.44% ఓట్లతో 77సీట్లు గెలుచుకున్నాయి. తర్వాత కాంగ్రెస్‌ నుంచి వలసలతో భాజపా బలం 111కి పెరిగింది. అధికార పక్షం మోదీ విజయాలు, అభివృద్ధిపై ఆధారపడి ముందుకెళ్తుంటే, ప్రతిపక్షాలు రాష్ట్రంలో భాజపా సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ ఓటర్లను ఆకర్షించాలని చూస్తున్నాయి.

రాష్ట్రంలో 1995 నుంచి భాజపా ప్రభుత్వాలు మొదలయ్యాయి. 1996 నుంచి ఏడాదిన్నర పాటు మినహా 1998 నుంచి భాజపా ప్రభుత్వాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. 14 నెలల క్రితం విజయ్‌రూపాణీని తొలగించి తొలిసారి ఎమ్మెల్యే అయిన పటేల్‌ వర్గానికి చెందిన భూపేంద్ర రజినీకాంత్‌ పటేల్‌ను ముఖ్యమంత్రి పీటం మీద భాజపా కూర్చోబెట్టింది. డబుల్‌ ఇంజిన్‌ (నరేంద్ర-భూపేంద్ర) నినాదంతో భాజపా ఎన్నికల శంఖం పూరిస్తూ ఉత్సాహంగా ముందడుగు వేస్తోంది. మోదీ తప్ప మిగతా విషయాలకేమీ ప్రాధాన్యంలేదన్నట్లు వ్యవహరిస్తూ ఎన్నికలకు వెళ్తోంది. అందుకే రాష్ట్రంలో భాజపాకు ఆయనే సర్వాంతర్యామిగా కనిపిస్తున్నారు.


కాంగ్రెస్‌కు నాయకత్వ లేమి

వ్యూహకర్త అహ్మద్‌పటేల్‌ రెండేళ్ల క్రితం మరణించడంతో కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో మార్గనిర్దేశం చేసే సీనియర్లు కరువయ్యారు. పీసీసీ అధ్యక్షుడు జగదీశ్‌ ఠాకుర్‌ బలం చాలడం లేదు. సీనియర్‌ నేత రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రలో మమేకం కావడంతో ఇక్కడ ప్రచారం చేసే పరిస్థితి కనిపించడంలేదు. రాష్ట్రంలోని 182 సీట్లకుగాను 66 పట్టణ, శివారు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ గత 30 ఏళ్లుగా గెలిచిన దాఖలా లేదు. 2017 నుంచి 2022 మధ్యకాలంలో 16 మంది ఎమ్మెల్యేలు హస్తాన్ని వీడి కమలం గూటికి చేరడం కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ లోపానికి అద్దంపడుతోంది.


ఆప్‌తో ఎవరికి ముప్పు?

దిల్లీ, పంజాబ్‌ల బలంతో కాంగ్రెస్‌ను వెనక్కు నెట్టి ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆప్‌, ఎంఐఎం పోటీ చేయడం వల్ల కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు చీలిపోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆప్‌ 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.3వేల నిరుద్యోగ భృతి, మహిళలకు నెలవారీగా రూ.వెయ్యి పింఛను నినాదాలతో సంక్షేమరాగం వినిపించడం వల్ల పట్టణ ప్రాంతాల్లోని భాజపా ఓటుకు భారీగా గండిపడే అవకాశం ఉంటుందని, అది తమకు మేలుచేస్తుందని కాంగ్రెస్‌ నమ్ముతోంది.


భాజపా బలాలు..

ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాల సమర్థ నాయకత్వం. భూపేంద్ర పటేల్‌ను ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా పటీదార్లలోని ఆగ్రహాన్ని చల్లార్చడం. క్షేత్ర స్థాయి నుంచి పార్టీకున్న సంస్థాగతమైన గట్టి పునాదులు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారం(డబుల్‌ ఇంజిన్‌)ఉండడం. భాజపా పాలనలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి. రాష్ట్రానికి తరలివస్తున్న భారీ ప్రాజెక్టులు. హిందుత్వ అంశం.

ప్రతికూలాంశాలు

దాదాపు మూడు దశాబ్దాలుగా రాష్ట్రంలో అధికారంలో కొనసాగడం. బిల్కిస్‌బానో అత్యాచార నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించడం, మోర్బీ వంతెన ప్రమాదం, గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యసౌకర్యాలు కొరవడటం, వరదల వల్ల నష్టపోయిన రైతులకు రెండేళ్లుగా పరిహారం చెల్లించకపోవడం, రహదారుల దుస్థితి, అత్యధిక విద్యుత్తు ఛార్జీలు, ప్రాజెక్టుల కోసం బలవంతంగా భూసేకరణ


కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అంశాలు..

దీర్ఘకాలంగా రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానానికే పరిమితమైనప్పటికీ దాదాపు 40శాతం స్థిరమైన ఓటు బ్యాంకును కలిగి ఉండడం. క్షత్రియ, దళిత, ఆదివాసీ, ముస్లింల ఓట్లను, భాజపాపై అసంతృప్తితో ఉన్న పటీదార్లను తన వైపునకు తిప్పుకోగలిగితే విజయం సాధించే అవకాశం.

ప్రతికూలతలు...

బలమైన రాష్ట్రస్థాయి నేత లేకపోవడం. రాష్ట్ర పార్టీలో ముఠాలు, అంతర్గత కలహాలు. సీనియర్‌ నాయకులు ఇతర పార్టీల్లోకి వలసపోవడం. కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుకు ఆప్‌ గండి కొట్టే అవకాశం.


ఆప్‌ సానుకూలాంశాలు..

మధ్యతరగతి, పేద ప్రజల్లో అధిక ఆదరణ. కేజ్రీవాల్‌ ప్రకటిస్తున్న ఆకర్షణీయ పథకాలు. దీర్ఘకాలంగా భాజపా అధికారంలో కొనసాగడం....దానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ ఎదగలేకపోవడం. యువతను ఆకట్టుకునే కొత్త రాజకీయ నినాదాలు.

ప్రతిబంధకాలు..

పార్టీ పునాదులు బలంగా లేకపోవడం. ప్రజాదరణ కలిగిన స్థానిక నాయకత్వ లేమి. గుజరాత్‌ రాజకీయాలకు కొత్త కావడం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని