Will Jacks: పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్‌

అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్‌ జాక్స్‌ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

Published : 29 Apr 2024 08:12 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వరుసగా ఆరు ఓటములను చవిచూసిన బెంగళూరు ప్లే ఆఫ్స్‌ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. అయితే, మళ్లీ పుంజుకుని హైదరాబాద్‌, గుజరాత్‌ను వరుస మ్యాచుల్లో చిత్తు చేసి అద్భుత విజయాలను నమోదు చేసింది. జీటీపై వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడి విల్‌ జాక్స్‌ (Will Jacks) హీరోగా నిలిచాడు. కేవలం 41 బంతుల్లోనే సెంచరీ సాధించిన అతడు.. 50 నుంచి 100 పరుగుల మార్క్‌ చేరుకొనేందుకు కేవలం 10 బంతులనే తీసుకున్నాడు. ఈ క్రమంలో రషీద్ ఖాన్‌ బౌలింగ్‌లో నాలుగు సిక్స్‌లు బాదేయడం ఇన్నింగ్స్‌కే హైలైట్. మ్యాచ్‌ అనంతరం తన ఆటతీరుపై జాక్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘భారీ విజయం సాధించడం అద్భుతంగా అనిపిస్తోంది. ఫాఫ్, విరాట్ కోహ్లీ శుభారంభం వల్లే సులువుగా మ్యాచ్‌ను గెలిచాం. క్రీజ్‌లోకి వచ్చిన తర్వాత కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకున్నా. అప్పుడు విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడి నామీద ఒత్తిడి లేకుండా చేశాడు. సరిగ్గా రెండు ఓవర్లు మావైతే మ్యాచ్‌ను త్వరగా ముగించేయొచ్చని టైమౌట్‌లో మాట్లాడుకున్నాం. మేం అనుకున్న విధంగానే జరిగింది. స్పిన్‌ బౌలింగ్‌లో ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు పాజిటివ్ కోణంలో ఎటాకింగ్‌ చేశా. మోహిత్‌ బౌలింగ్‌లోనూ భారీగా పరుగులు రాబట్టడంతో రిలాక్స్‌ కాగలిగా. మిగతా మ్యాచుల్లోనూ మేం గెలిచి ప్రత్యర్థులకు సవాల్ విసురుతాం. విరాట్‌తో కలిసి బ్యాటింగ్‌ చేయడం ఎప్పటికీ మరిచిపోలేను. ఇవాళ నాకు అదృష్టం కూడా కలిసొచ్చింది. తొలి 17 పరుగులను 17 బంతుల్లో చేసిన నేను ఇలా హిట్టింగ్‌ చేయడానికి అవతల క్రీజ్‌లో దిగ్గజ క్రికెటర్‌ ఉండటమే కారణం. కోహ్లీ నాకు కావాల్సినంత సమయం ఇచ్చాడు. ఇంకాస్త త్వరగా పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని జాక్స్‌ తెలిపాడు.  

16 ఓవర్లలో అనుకోలేదు: డుప్లెసిస్‌

‘‘మేం బౌలింగ్‌ చేసేటప్పుడే ఈ పిచ్‌పై ఎంతటి స్కోరునైనా ఛేదించవచ్చని భావించాం. కానీ, 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ముగిస్తామని అనుకోలేదు. బౌలింగ్‌, బ్యాటింగ్ విభాగాల్లో చాలా మెరుగయ్యాం. టోర్నీ ప్రారంభంలో విజయాలకు చాలా దూరంగా ఉన్నాం. ఇప్పుడు మాత్రం మా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. టీ20ల్లో స్కోరు బోర్డును చూశాక.. బౌలర్లూ మీరేం చేస్తారు? అనే పరిస్థితి ఇప్పుడు ఉండటం లేదు. ఫార్మాట్‌ చాలా మారిపోతోంది. కోల్‌కతాతో మ్యాచ్‌లో తొలిసారి మేం అనుకున్న విధంగా బౌలింగ్‌ చేయగలిగాం. ఆ తర్వాత అదే ఉత్సాహాన్ని కొనసాగించాం’’ అని డుప్లెసిస్‌ వ్యాఖ్యానించాడు. 

ఇలాగే ఆడితే.. 

ప్రస్తుతం ఆరు పాయింట్లతో పట్టికలో అట్టడుగున ఉన్న బెంగళూరుకు ఇంకా నాలుగు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు గుజరాత్‌పై సాధించిన భారీ విజయంలా.. ఆ నాలుగింట్లోనూ గెలిస్తే సీజన్‌ను గౌరవప్రదంగా ముగించే అవకాశం ఉంటుంది. అప్పుడు 14 పాయింట్లు బెంగళూరు ఖాతాలోకి వస్తాయి. ఇతర జట్ల సమీకరణాలతో ప్లేఆఫ్స్‌ అవకాశమూ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని