యాత్రతో నాలో సహనం పెరిగింది

భారత్‌ జోడో యాత్ర చేపట్టిన తర్వాత తనలో మార్పులు కనిపిస్తున్నాయనీ, ముఖ్యంగా సహనం పెరిగిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పారు.

Published : 30 Nov 2022 04:42 IST

ఇతరులు చెప్పేది ఓపిగ్గా వింటున్నాను
భారత్‌ జోడో మొదలుపెట్టాక మార్పు వచ్చింది
ఇవి నాకు ప్రయోజనకరం: రాహుల్‌

ఇందోర్‌: భారత్‌ జోడో యాత్ర చేపట్టిన తర్వాత తనలో మార్పులు కనిపిస్తున్నాయనీ, ముఖ్యంగా సహనం పెరిగిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పారు. సోమవారం ఇందోర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యాత్రలో అత్యంత సంతృప్తినిచ్చిన సందర్భాలేమిటనే ప్రశ్నకు ఆయన వివరంగా సమాధానమిచ్చారు. ‘..సంతృప్తినిచ్చినవి చాలా ఉన్నాయి. మొదటిది- నాలో ఓపిక బాగా పెరిగింది. రెండోది- రోజుకు ఎనిమిది గంటలపాటు ప్రజల మధ్య ఉన్నప్పుడు అటూఇటూ ఎవరైనా లాగినా, నెట్టేసినా నాలో చికాకు కలగడం లేదు. గతంలోనైతే రెండు గంటల్లోనే అసహనం మొదలయ్యేది. మూడోది- ఇంతకుముందు కంటే ఇప్పుడు ఇతరులు చెప్పేది వినే సామర్థ్యం మెరుగుపడింది. ఎవరైనా నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే బాగా వింటున్నాను. ఇవన్నీ నాకు ప్రయోజనం కలిగించేవేనని అనుకుంటున్నా’ అని రాహుల్‌ చెప్పారు.

ఆ నొప్పితో నడవగలనా అని భయపడ్డాను

‘యాత్ర ఆరంభించడానికి ముందు ఓ పాత గాయం కారణంగా మోకాళ్లలో నొప్పులు ఉండేవి. అవి గతంలో తగ్గిపోయినా, నడక మొదలయ్యాక ఇబ్బంది పెట్టాయి. ఆ పరిస్థితుల్లో పాదయాత్రను కొనసాగించగలనా అని భయపడ్డాను. కానీ నెమ్మదిగా భయం పోయింది. నడక అలవాటైంది. దక్షిణాది రాష్ట్రాల్లో నడుస్తున్నప్పుడు ప్రజలు నన్ను నెడుతూ వెళ్తుంటే ఇబ్బందికరంగా ఉండేది. ఓ చోట ఆరేళ్ల బాలిక నా దగ్గరకు వచ్చి ఒక చీటీ ఇచ్చింది. తను వెళ్లిపోయాక దానిని తీసి చదివాను. నేను ఒంటరిగా నడుస్తున్నట్లు భావించవద్దనీ, తల్లితండ్రులు అనుమతించనందున కలిసి రాలేకపోతున్నా తానూ నడుస్తున్నట్లేనని లేఖలో ఉంది. అది గొప్ప విషయం. ఇలాంటివి కొన్ని వేల ఉదాహరణలు ఉన్నా ఇది మొదటగా గుర్తుకు వచ్చింది’ అని రాహుల్‌ వివరించారు. ఉజ్జయినిలోని ప్రఖ్యాత మహాకాల్‌ ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని