ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తీరథ్‌సింగ్‌ రావత్‌ రాజీనామా

ఉత్తరాఖండ్‌లో రాజకీయాలు అనూహ్య మలుపు తీసుకున్నాయి. భాజపా అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరథ్‌సింగ్‌ రావత్‌ పదవి నుంచి వైదొలిగారు. శుక్రవారం రాత్రి గవర్నర్‌ బేబీ రాణి మౌర్యను కలిసి

Updated : 03 Jul 2021 11:19 IST

దిల్లీ, దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లో రాజకీయాలు అనూహ్య మలుపు తీసుకున్నాయి. భాజపా అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరథ్‌సింగ్‌ రావత్‌ పదవి నుంచి వైదొలిగారు. శుక్రవారం రాత్రి గవర్నర్‌ బేబీ రాణి మౌర్యను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. మరోవైపు- నూతన సీఎంను ఎన్నుకునేందుకుగాను ఉత్తరాఖండ్‌ భాజపా ఎమ్మెల్యేలు దేహ్రాదూన్‌లో శనివారం భేటీ కానున్నారు. సత్పాల్‌ మహారాజ్‌, ధన్‌సింగ్‌ రావత్‌ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. తీరథ్‌సింగ్‌ ముఖ్యమంత్రి పీఠమెక్కి నాలుగు నెలలైనా పూర్తికాకపోవడం గమనార్హం.

పార్టీలో తీవ్ర అసమ్మతి కారణంగా త్రివేంద్ర సింగ్‌ రావత్‌ ఈ ఏడాది మార్చిలో ఉత్తరాఖండ్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. అదే నెల 10న నూతన ముఖ్యమంత్రిగా తీరథ్‌సింగ్‌ ప్రమాణం చేశారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన.. సీఎం పీఠంపై కొనసాగాలంటే సెప్టెంబరు 10లోపు అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గంగోత్రి, హల్ద్వానీ స్థానాల్లో ఏదో ఒకదాన్నుంచి ఆయన ఉప ఎన్నికల బరిలో దిగుతారని తొలుత అంచనాలు వెలువడ్డాయి. అయితే ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది మార్చితోనే ముగియనుండటం, కొవిడ్‌ మహమ్మారి ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాకపోవడంతో ఎన్నికల సంఘం (ఈసీ) ఉప ఎన్నికలను నిర్వహించే అవకాశాలు దాదాపుగా కనిపించడం లేదు. మరోవైపు- సీఎం అయ్యాక పలు వివాదాస్పద వ్యాఖ్యలతో భాజపా అధిష్ఠానానికి తీరథ్‌సింగ్‌ తలనొప్పులు తెచ్చిపెట్టారు. పార్టీ నేతల్లో అంతర్గత విభేదాలనూ పరిష్కరించలేకపోయారు. ఆయన హయాంలో కుంభమేళా నిర్వహణ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సీఎంను మార్చేందుకు అధిష్ఠానం మొగ్గుచూపింది!

తొలుత నడ్డాకు రాజీనామా పత్రం సమర్పణ
తీరథ్‌సింగ్‌ గత బుధవారం దిల్లీకి వెళ్లారు. అదేరోజు నడ్డాతో భేటీ అయ్యారు. తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతోనూ సమావేశమయ్యారు. వాస్తవానికి గురువారమే ఆయన తిరిగి రాష్ట్రానికి చేరుకోవాల్సి ఉన్నా.. 3 రోజులపాటు హస్తినలోనే ఉన్నారు. నడ్డాతో శుక్రవారం మరోసారి భేటీ అయ్యారు. పదవి నుంచి తప్పుకోవాలని పార్టీ ఆదేశించడంతో.. తన రాజీనామా పత్రాన్ని తొలుత నడ్డాకు అందజేశారు. అనంతరం దేహ్రాదూన్‌ వెళ్లి గవర్నర్‌కు రాజీనామా సమర్పించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని