
Punjab: సిద్ధూ మంత్రి పదవి కోసం పాక్ ప్రధాని రాయబారం.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
చండీగఢ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవజ్యోత్‌సింగ్‌ను తిరిగి మంత్రి పదవిలోకి తీసుకోవాలని పాకిస్థాన్ నుంచి గతంలో తనకు రాయబారం అందినట్లు పేర్కొన్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేరుతో ఓ సందేశం వచ్చినట్లు ఆరోపించారు.
పంజాబ్ రాజకీయాల్లో కెప్టెన్, సిద్ధూ మధ్య వివాదం అప్పట్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇరువురి మధ్య విబేధాల నేపథ్యంలో సిద్ధూ.. సొంత పార్టీపైనే విమర్శలు చేశారు. ఈ వివాదాలు కాస్తా కాంగ్రెస్ పార్టీలో సంక్షోభానికి తెరలేపాయి. దీంతో సిద్ధూను మంత్రి పదవి నుంచి కెప్టెన్ తొలగించారు. అయితే ఈ క్రమంలోనే.. సిద్ధూను మళ్లీ మంత్రి పదవిలోకి తీసుకోవటంపై పాకిస్థాన్ ప్రధాని లాబీయింగ్ చేసినట్లు అమరీందర్ తాజాగా షాకింగ్ కామెంట్లు చేశారు.
‘సిద్ధూ అసమర్థుడు కాబట్టి అతడిని నా మంత్రివర్గం నుంచి తొలగించాను. 70 రోజుల సమయంలో ఒక్క ఫైల్‌ను అతడు సిద్ధం చేయలేకపోయాడు. అయితే రెండు మూడు వారాల తర్వాత సిద్ధూని తిరిగి రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని పాకిస్థాన్ నుంచి నాకు ఓ మెసేజ్ వచ్చింది. ఈసారి చేర్చుకోండి. అయినప్పటికీ అతడు సరైన పనితీరు కనబరచకపోతే మళ్లీ తొలగించండి’ అంటూ పాక్ ప్రధాని పేరుతో ఓ సందేశం వచ్చిందని విలేకర్ల సమావేశంలో మాజీ సీఎం అమరీందర్ ఆరోపించారు. ఈ సమావేశంలో భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు హర్దీప్‌సింగ్ పూరీ, గజేంద్రసింగ్ షెకావత్ కూడా ఉన్నారు.