Gujarat Polling: గుజరాత్‌ పోలింగ్ వేళ.. భాజపా అభ్యర్థిపై దాడి

యావత్ దేశం ఆసక్తికరంగా ఎదురుచూస్తోన్న గుజరాత్ తొలి విడత పోలింగ్‌ గురువారం కొనసాగుతోంది. తొలి గంటల్లోనే పలువురు ప్రముఖులు ఓటేశారు. ఇక కొన్ని చోట్ల స్వల్ప ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకున్నాయి.

Updated : 01 Dec 2022 12:12 IST

గాంధీనగర్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ గురువారం కొనసాగుతోంది. స్వల్ప ఉద్రిక్తతలు మినహా ఓటింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. తొలి గంటల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా.. పోలింగ్‌ ప్రారంభానికి ముందు ఓ భాజపా అభ్యర్థిపై దాడి జరగడం స్థానికంగా కాస్త కలకలం రేపింది.

వాంసద నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీ చేస్తున్న పీయూష్‌ పటేల్‌పై గురువారం తెల్లవారుజామున కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఝారీ గ్రామంలో పీయూష్‌ కారులో వెళ్తుండగా దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో పీయూష్‌ తలకు గాయమైంది. వాంసద కాంగ్రెస్‌ అభ్యర్థి అనంత్‌ పటేల్‌ అనుచరులే ఈ దాడికి పాల్పడినట్లు భాజపా ఆరోపిస్తోంది.

ఓటేసిన ప్రముఖులు..

ఇక తొలి విడతలో భాగంగా 19 జిల్లాల పరిధిలోని 89 నియోజకవర్గాలకు నేడు పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 9 గంటల వరకు 4.92శాతం ఓటింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తొలి గంటల్లో పలువురు ప్రముఖులు ఓటేశారు. మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ మంగూభాయ్‌ పటేల్‌ దంపతులు, క్రికెటర్‌ రవీంద్ర జడేజా సతీమణి, భాజపా అభ్యర్థి రీవాబా , గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ దంపతులు, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్‌ ఇటాలియా, పలువురు మంత్రులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

బామ్మ స్ఫూర్తి..

ఉమర్‌గమ్‌ ప్రాంతంలో 100 ఏళ్ల కాముబెన్‌ లాలాభాయ్‌ పటేల్‌ ఓటేసి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. తొలి గంటలోనే స్వయంగా పోలింగ్‌ స్టేషన్‌కు వచ్చిన ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలువురు వయో వృద్ధులు కూడా పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు.

రికార్డు స్థాయిలో వచ్చి ఓటెయ్యండి..

తొలి విడత పోలింగ్‌ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్‌ వేదికగా రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు.. ముఖ్యంగా తొలి ఓటర్లు రికార్డు స్థాయిలో వచ్చి ఓటెయ్యాలని కోరారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు