Ap News: ‘చెత్త పన్ను’ పేరుతో పీడిస్తారా?: నాదెండ్ల

కరోనా వ్యాప్తితో రాష్ట్ర ప్రజలంతా తీవ్ర భయాందోళనలకు గురవుతూ, ఆర్థిక సమస్యలతో కొట్టిమిట్టాడుతుంటే వారిలో ధైర్యం ..

Published : 06 Jun 2021 01:13 IST

అమరావతి: కరోనా వ్యాప్తితో రాష్ట్ర ప్రజలంతా తీవ్ర భయాందోళనలకు గురవుతూ, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే వారిలో ధైర్యం నింపాల్సిన ప్రభుత్వం బాధ్యతను విస్మరించిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. ఏపీలోని మున్సిపాలిటీల్లో చెత్త పన్ను వసూలు చేయడాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ‘‘ప్రజల బాధలను తీర్చాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. అందువల్లే ప్రతి ఇంటి నుంచి నెలకు రూ.90 నుంచి రూ.200 వసూలు చేయాలని నిర్ణయించింది. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు నగదు ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఈ ‘ చెత్త వ్యవహారం’పై ఏం చెబుతారు?’’ అని నాదెండ్ల ప్రశ్నించారు. ఇదంతా ఒక చేత్తో ఇచ్చి.. మరో చేత్తో గుంజుకునే వ్యవహారమేనని ఎద్దేవా చేశారు.

మహమ్మారి విరుచుకుపడిన తరుణంలో ప్రజలు ఉపాధికి దూరమై ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారని నాదెండ్ల అన్నారు. వారిని ఆ సమస్య నుంచి గట్టెక్కించకుండా తిరిగి పన్నుల రూపంలో ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు.  రాబోయే రోజుల్లో ఏపీ ప్రజలు ఇంకెన్ని పన్నులు భరించాల్సి వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లోనైనా, మున్సిపాలిటీల్లోనైనా పారిశుద్ధ్య నిర్వహణ ప్రభుత్వ భాధ్యత అనీ, దాని నుంచి తప్పించుకునేందుకే ఇలాంటి పన్నులు విధిస్తోందని నాదెండ్ల ఆరోపించారు. వైకాపా గత రెండేళ్ల పాలనలో ఏ పట్టణంలోనైనా, ఏ డంపింగ్‌ యార్డులోనైనా ఆధునిక విధానంలో చెత్తను తగులబెట్టిందా? అని ప్రశ్నించారు. పర్యావరణ హితమైన మార్గాల్లో చెత్త నుంచి సంపద సృష్టించే ప్రయత్నం చేసిందా? అని అన్నారు. గతంలో చెత్తను ఎరువుగా మార్చేందుకు కేంద్రాలు నిర్మించిన విషయాన్ని గుర్తు చేస్తూ..  ప్రస్తుతం ఆ కేంద్రాల నిర్వహణ ఎలా ఉంది? దానిపై రాబడి వస్తోందా? అసలు ఇప్పుడు చెత్తపై పన్నులు వసూలు చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? తదితర ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని నాదెండ్ల డిమాండ్‌ చేశారు. చెత్తపై పన్ను విధించాలనే ఆదేశాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని