Deve Gowda: ‘ఒకటి రెండు సీట్లు వచ్చినా.. సరే! ఒంటరిగానే పోటీ’

లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవేగౌడ ఉద్ఘాటించారు. తమ పార్టీ బలంగా ఉన్న స్థానాల్లోనే అభ్యర్థులను బరిలోకి దించుతామని పేర్కొన్నారు.

Updated : 25 Jul 2023 18:20 IST

బెంగళూరు: కర్ణాటకవాసుల ప్రయోజనాల దృష్ట్యా భాజపాతో (BJP) కలిసి పని చేస్తామని జేడీఎస్‌ (JDS) నేత, మాజీ సీఎం కుమారస్వామి (HD Kumaraswamy) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. 2024 లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections 2024)కు ముందే భాజపాతో జేడీఎస్‌ పొత్తు పెట్టుకుంటుందనే వార్తలకు ఇది బలం చేకూర్చినట్లయ్యింది. అయితే, పార్టీ అధినేత, మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ (HD Deve Gowda) మాత్రం.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఉద్ఘాటించారు.

‘ఒకటి రెండు సీట్లు వచ్చినా సరే.. లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీ చేస్తాం. పార్టీ శ్రేణులతో సంప్రదింపుల అనంతరం జేడీఎస్‌ బలంగా ఉన్న స్థానాల్లోనే అభ్యర్థులను బరిలోకి దించుతాం’ అని దేవెగౌడ పేర్కొన్నారు. అయితే.. పరిస్థితుల ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తామని కూడా చెప్పడం గమనార్హం. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన ప్రతిపక్షాల సమావేశానికి తనను ఆహ్వానించాలని బిహార్‌ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్‌కుమార్‌ భావించినప్పటికీ.. రాష్ట్ర కాంగ్రెస్‌లోని ఓ వర్గం వ్యతిరేకించిందన్నారు.

భాజపాతో కలిసి పనిచేస్తామన్న కుమారస్వామి..!

ఎన్డీయే, ‘ఇండియా’ కూటముల్లో చేరని 11 పార్టీల్లో జనతాదళ్‌ (ఎస్‌) ఒకటి. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారం దక్కించుకోగా.. భాజపా, జేడీఎస్‌లు ప్రతిపక్షంలో కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ‘ఇండియా’ నేతలకు భద్రత కల్పించడంపై భాజపా చేపట్టిన ఆందోళనలకు జేడీఎస్‌ మద్దతు ఇచ్చింది. అసెంబ్లీలో భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై నిరసన తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో.. భాజపాతో జేడీఎస్‌ పొత్తుకు సిద్ధమవుతోందన్న వార్తలు వినిపించాయి. అయితే.. తాము ఎవరితో కలిసి పోటీ చేయమని దేవెగౌడ తేల్చిచెప్పడం గమనార్హం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని