HD Kumaraswamy: భాజపాతో కలిసి పనిచేస్తామన్న కుమారస్వామి.. ఎన్డీయే కూటమిలోకి జేడీఎస్‌ వెళ్లే సూచన!

కర్ణాటకలో (Karnataka) జేడీఎస్‌ (JDS) క్రమంగా భాజపాకు (BJP) దగ్గరవుతోంది. లోక్‌సభ ఎన్నికల నాటికి ఆ పార్టీ ఎన్డీయే కూటమిలో చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Published : 22 Jul 2023 01:46 IST

బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా భాజపాతో (BJP) కలిసి పని చేస్తామని జేడీఎస్‌ (JDS) నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి (HD Kumaraswamy) ప్రకటించారు. జేడీఎస్‌కు సంబంధించిన తుది నిర్ణయం తీసుకునే అధికారం మాజీ ప్రధాని దేవెగౌడ తనకే ఇచ్చారన్నారు. పార్లమెంటు ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో పొత్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఈలోగా కర్ణాటకలో ప్రతిపక్షంగా కొనసాగుతూ భాజపాతో కలిసి అధికార కాంగ్రెస్‌పై (Congress) పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.

గురువారం రాత్రి శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ప్రధాని దేవెగౌడ సైతం హాజరయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే భాజపాతో జేడీఎస్‌ పొత్తు పెట్టుకుంటుందనే వార్తల నేపథ్యంలో ఆయన హాజరు ప్రాధాన్యతను సంతరించుకుంది. ‘అసెంబ్లీ లోపల, బయట భాజపా, జేడీఎస్‌ రెండూ ప్రతిపక్ష పార్టీలని ఇదివరకే చెప్పాను. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా భాజపాతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. ఇవాళ ఉదయం సైతం ఎలా ముందుకెళ్దామనే అంశంపై మా పార్టీ ఎమ్మెల్యేలంతా కలిసి చర్చించామని’ కుమారస్వామి వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా 11 నెలల సమయం ఉందని, ఎన్నికలు వచ్చే వరకు వేచి చూస్తామన్నారు.

అర్వింద్‌.. 24 గంటల సమయం ఇస్తున్నా: ఎమ్మెల్సీ కవిత సవాల్

224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో ఈ మేలో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ సొంతంగా 135 స్థానాలు సాధించి అధికారం చేజిక్కించుకుంది. భాజపా 66, జేడీఎస్‌ 19 స్థానాలకు పరిమితం కావడంతో ప్రతిపక్షంలో కొనసాగుతున్నాయి. దేశంలో రాజకీయ పునరేకీరణలో భాగంగా ఈ వారంలో ఎన్డీయే, ఇండియా కూటముల్లో పార్టీలు భారీగా చేరాయి. ఏ కూటమిలోనూ చేరని పార్టీలు 11 కాగా.. అందులో జనతాదళ్‌ (ఎస్‌) సైతం ఉంది. పార్టీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం దేవెగౌడ తనకే ఇచ్చారని చెబుతున్న కుమారస్వామి లోక్‌సభ ఎన్నికల నాటికి ఎన్డీయే వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని