Kapil Sibal : వంటగ్యాస్‌ ధర తగ్గింపు ‘తాయిలాల సంస్కృతి’ కాదా : కపిల్‌ సిబల్‌

లోక్‌సభ ఎన్నికలను (Loksabha elections) దృష్టిలో పెట్టుకొనే కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌ ధరలు తగ్గించిందని ఎంపీ కపిల్‌ సిబల్‌ (Kapil Sibal) విమర్శించారు. తాజా ప్రకటన ఎన్నికల తాయిలాల్లో భాగమేనని చెప్పారు.

Published : 30 Aug 2023 19:01 IST

దిల్లీ : లోక్‌సభ ఎన్నికలు (Loksabha elections) సమీపిస్తున్న వేళ ప్రధాని నరేంద్రమోదీ (Narendra modi) వంట గ్యాస్‌ సిలిండర్ల ధరలు తగ్గించడం ‘తాయిలాల సంస్కృతి’లో భాగం కాదా అని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్‌ (Kapil Sibal) ప్రశ్నించారు. గృహావసరాలకు వినియోగించే వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.200 తగ్గిస్తున్నట్లు మంగళవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కపిల్‌ సిబల్ ట్విటర్‌ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. ‘ప్రధాన మంత్రిగారూ.. ఉజ్వల పథకం కింద రూ.400 తగ్గించడం ‘తాయిలాల సంస్కృతి’ కాదా? ఇది మీరు పేద కుటుంబాల కోసం చేసిన ఆలోచన అని నేను అనుకుంటున్నాను. మీకు వారు గుర్తున్నందుకు సంతోషం. 2024 సమీపిస్తున్న కొద్దీ మీరు వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తారని నా కచ్చితమైన అభిప్రాయం. మీరు చేసిన పని ప్రతిపక్షాలు చేస్తే మాత్రం అది ‘తాయిలాల సంస్కృతి’ అవుతుంది! జైహో!’ అంటూ ముగించారు. 

బీఎస్పీ ఏ కూటమిలోనూ చేరడం లేదు : మాయావతి

ఆడపడుచులకు రాఖీ కానుక అంటూ వంటగ్యాస్‌ ధరల తగ్గింపుపై ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో సిలిండర్‌ ధర రూ.903 ఉంది. కేంద్ర నిర్ణయం అమల్లోకి రాక ముందు ఆ ధర రూ.1,103గా ఉండేది. తాజాగా ఉజ్వల పథకం లబ్ధిదారులకు రూ.400 మేర ప్రయోజనం కలిగి అది రూ.703కే అందుతోంది. గృహ వినియోగదారులకు ఊరట కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ తగ్గింపు నిర్ణయం తీసుకున్నామని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం అదనంగా 75 లక్షల ఉజ్వల కొత్త కనెక్షన్లు ఇస్తుందని, దాంతో పథకం లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరుకుంటుందని ఆయన చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని