కేంద్ర విద్యుత్‌ చట్టం చాలా ప్రమాదం: కేసీఆర్‌

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యుత్‌ చట్టం చాలా ప్రమాదమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. విద్యుత్‌ సమస్యలపై స్వల్పకాలిక...

Updated : 15 Sep 2020 14:22 IST

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యుత్‌ చట్టం చాలా ప్రమాదమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. విద్యుత్‌ సమస్యలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... కేంద్రం తెచ్చే చట్టాన్ని అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని గుర్తు చేశారు.  కేంద్ర విద్యుత్‌ చట్టంలో అనేక లోపాలు ఉన్నాయని వివరించారు. ఈ చట్టం ద్వారా రాష్ట్రాల అధికారాలు దిల్లీ వెళ్తాయని పేర్కొన్నారు. రాష్ట్రాల లోడ్‌ సెంటర్లు అన్నీ కేంద్రం వద్దకు వెళ్తాయని వివరించారు. 

‘‘ కొత్త చట్టం తేవొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి, సమాఖ్య స్ఫూర్తిని అడ్డంగా నరికే చట్టం ఇది. మన రాష్ట్రంలో జల విద్యుదుత్పత్తికి ఎక్కువ అవకాశం ఉంది. కొత్త చట్టంలో రెన్యుబుల్‌ విద్యుత్‌ 20శాతం ఉండాలని నిబంధన. కొత్త చట్టం ద్వారా రాష్ట్రాలు తప్పనిసరిగా విద్యుత్‌ కొనాలి. కేంద్ర చట్టం ద్వారా రాష్ట్రంలో 26లక్షల బోర్లకు మీటర్లు పెట్టాలి. ప్రతి బోరుకు ఒక మీటరు పెట్టాలి. కొత్త మీటర్ల కోసమే రూ.700 కోట్లు కావాలి. కేంద్ర విద్యుత్‌ బిల్లును పార్లమెంట్‌లో మేం వ్యతిరేకిస్తాం. విద్యుత్‌ రంగం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంటేనే డిస్కంలు, ట్రాన్స్‌కో, జెన్‌కో అభివృద్ధి చెందుతాయి. నూతన చట్టం అమల్లోకి వస్తే మీటర్‌ రీడింగ్‌ తీస్తారు.. బిల్లులు ముక్కుపిండి వసూలు చేస్తారు. కేంద్రం తెచ్చే కొత్త చట్టంతో రాష్ట్రాలకు నియంత్రణ ఉండదు’’ అని పేర్కొన్నారు. దేశ ప్రజలు, రైతులపై పెనుభారం మోపే విధంగా ఉన్న విద్యుత్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్‌ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. బిల్లు ఉపసంహరణ తీర్మానానికి తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

లాక్‌డౌన్‌లో బిల్లుల సమస్య పరిష్కరిస్తాం 
 కొవిడ్‌ కారణంగా లాక్‌డౌన్‌ సమయంలో విద్యుత్‌ బిల్లులు భారీగా రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. లాక్‌డౌన్‌ సమయంలో మూడు నెలల విద్యుత్‌ బిల్లు కలిపి ఒకేసారి వేయడం వల్ల తనకు రూ.55వేల బిల్లు వచ్చిందని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉందని సభకు వివరించారు. రూ.వేలల్లో విద్యుత్‌ బిల్లులు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.  దీనిపై సీఎం కేసీఆర్‌ స్పందిస్తూ... విద్యుత్‌ బిల్లుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. లాక్‌డౌన్‌ సమయంలో.. మూడు నెలలకు కలిపి కాకుండా విభజించి విడిగా ఏ నెలకు ఆనెల బిల్లువేసి లోపాలు సరిదిద్దాలనే ఈరోజే అధికారులకు ఆదేశాలు ఇస్తామని కేసీఆర్‌ తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని