Kejriwal: ఒక్క అవకాశం ఇవ్వండి.. గుజరాత్‌ ప్రజలకు కేజ్రీవాల్‌ విజ్ఞప్తి

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న వేళ.. ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో గత 27 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలించేందుకు భాజపాకు అవకాశం ఇచ్చారన్న ఆయన.. ఈ ఐదేళ్లు ఆమ్‌ ఆద్మీ పార్టీకి అవకాశం ఇవ్వండని ఓటర్లను అభ్యర్థించారు.

Published : 08 Nov 2022 01:39 IST

రాజ్‌కోట్‌: గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలకు (Gujarat Assembly) గడువు సమీపిస్తోన్న వేళ.. భాజపా పాలనపై ఆమ్‌ఆద్మీ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal).. భాజపా పాలనలో మోర్బీ వంతెన వంటి విషాద ఘటన మరోసారి ఎప్పుడైనా ఎవరికైనా ఎదురుకావచ్చన్నారు. ఆ ఘటనలో ఓ ప్రైవేటు సంస్థ యజమానులపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. రాజ్‌కోట్‌లో జరిగిన రోడ్‌షోలో పాల్గొని ప్రసంగించిన ఆయన.. రాష్ట్రాన్ని పాలించేందుకు తమ పార్టీకి (AAP) ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు.

‘వంతెనకు మరమ్మతులు చేసిన కంపెనీని రక్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం విచారకరం. కనీసం ఆ సంస్థ యజమానుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయలేదు. వారిని అరెస్టు చేయకూండా ఎందుకు కాపాడుతున్నారు..? ప్రాణాలు కోల్పోయిన 135 మందిలో 55 మంది చిన్నారులే ఉన్నారు. ఇటువంటి విషాదాన్ని చూడడం ఎంతగానో బాధిస్తోంది’ అని రాజ్‌కోట్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆప్ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

గత 27ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలించేందుకు భాజపాకు (BJP) రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారన్న కేజ్రీవాల్‌.. ఈ ఐదేళ్లు ఆమ్‌ఆద్మీకి (AAP) ఇచ్చి చూడండని అభ్యర్థించారు. దేశ రాజధాని దిల్లీతోపాటు పంజాబ్‌ రాష్ట్రాల్లో తాము చేపట్టిన పనుల ఆధారంగానే గుజరాత్‌ పౌరులకు హామీలు ఇస్తున్నామని చెప్పారు. వచ్చే మార్చి నుంచి కరెంటు బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదన్న ఆయన.. దిల్లీ, పంజాబ్‌లలో ఉచిత కరెంటును అమలు చేస్తున్నామని చెప్పారు. ఇక గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్‌ 1, 5 వ తేదీల్లో రెండు విడతల్లో జరగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని