Andhra news: రోజూ ఏదో ఒక కుట్ర: తెదేపాపై కొడాలి నాని ఫైర్‌

మహిళల్ని అడ్డం పెట్టుకొని తెదేపా నేతలు అధికారంలోకి రావాలని చూస్తున్నారని వైకాపా నేత, మాజీ మంత్రి కొడాలి నాని....

Updated : 18 Aug 2022 16:50 IST

విజయవాడ: మహిళల్ని అడ్డం పెట్టుకొని తెదేపా నేతలు అధికారంలోకి రావాలని చూస్తున్నారని వైకాపా నేత, మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. ప్రభుత్వంపై రోజూ ఏదో ఒక కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియోపై అమెరికాలోని ఓ ప్రైవేటు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఎలా ప్రామాణికం అవుతుంది.. ఆ నివేదికను తాము గుర్తించబోమంటూ సీఐడీ చీఫ్‌ సునీల్ కుమార్‌ చేసిన ప్రకటన తర్వాత నాని మీడియాతో మాట్లాడారు. గోరంట్ల మాధవ్‌ మహిళల్ని వేధించినట్టో, ఇలా వీడియో కాల్‌ చేసి ఇబ్బంది పెట్టినట్టో ఒక్క ఫిర్యాదు చేయించినా విచారణ జరిపి అవసరమైతే అరెస్టు చేయిస్తామని ప్రభుత్వం ఇప్పటికే చెప్పిందన్నారు. కానీ, తమ వద్ద ఆధారాలు ఉంటున్నాయంటోన్న తెదేపా నేతలు ఆ మహిళతో ఫిర్యాదు చేయించి, అసలైన వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించమంటే అదీ చేయడంలేదని మండిపడ్డారు. నకిలీ వీడియోని సృష్టించి దాంతో రాజకీయం చేస్తున్నారన్నారు. పదవులను మాత్రం తన సామాజిక వర్గం మహిళలకే ఇస్తున్న చంద్రబాబు.. ఇలాంటి వీడియోలపై మాత్రం దళిత మహిళలతో మాట్లాడిస్తున్నారంటూ నాని ఆరోపించారు.

అశ్లీల వీడియోలతో రాజకీయం చేస్తున్నారు: పేర్ని నాని

తాడేపల్లి: అశ్లీల వీడియోలతో తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తోందని వైకాపా ఎమ్మెల్యే, మాజీమంత్రి పేర్ని నాని విమర్శించారు. మాధవ్‌ వీడియో వ్యవహారంపై తాడేపల్లిలోని పార్టీ కార్యాయలంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పోతిన ప్రసాద్‌ దొంగ రిపోర్టును ప్రచారం చేశారని అమెరికాలోని ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రతినిధి  జిమ్స్‌ స్టాఫర్డ్‌  లిఖిత పూర్వకంగా తెలిపారు. ఈ రిపోర్టును ట్యాంపర్‌ చేయించడం చంద్రబాబు నేరం కాదా?. ఒరిజినల్‌ వీడియో లేనప్పుడు.. ఎన్ని జిమ్మిక్కులు చేసి తప్పుడు రిపోర్టులు తెచ్చినా.. వైకాపా ప్రభుత్వం, ఎంపీ మాధవ్‌పై మీ కుట్రలు ఫలించవు. ఈ వీడియో మొత్తం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, లోకేశ్‌ సృష్టించిందే. ఈ వీడియోను పోస్టు చేసింది తెలుగుదేశం పార్టీ వెబ్‌సైట్‌లో. వీడియో తయారు చేసినందుకు తెలుగుదేశం పార్టీని, పోస్టు చేయించినందుకు చంద్రబాబును, అశ్లీల విడియోను పదే పదే చూపించిన టీవీ ఛానళ్ల యాజమాన్యాలను చట్టపరంగా అరెస్టు చేయాల్సిన అవసరముంది. అమెరికా సంస్థే ఇది అబద్ధమని చెబుతున్నప్పుడు తెదేపాపై, మీడియాపై వైకాపా తరఫున పోలీసులకు ఫిర్యాదు చేయదల్చుకున్నాం’’ అని పేర్ని నాని వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని