KTR: కర్మ సిద్ధాంతం ప్రకారం చేసింది తిరిగి అనుభవించాల్సిందే: కేటీఆర్‌

గుజరాత్‌లో 2002లో చోటుచేసుకున్న బిల్కిస్‌ బానో గ్యాంగ్‌ రేప్‌ కేసులో 11 మంది దోషులను అక్కడి ప్రభుత్వం విడుదల చేయడంపై మంత్రి

Published : 20 Aug 2022 01:35 IST

హైదరాబాద్‌: గుజరాత్‌లో 2002లో చోటుచేసుకున్న బిల్కిస్‌ బానో గ్యాంగ్‌ రేప్‌ కేసులో 11 మంది దోషులను అక్కడి ప్రభుత్వం విడుదల చేయడంపై మంత్రి కేటీఆర్‌ భాజపాపై విమర్శలు గుప్పించారు. ఒమిషన్‌, కమిషన్‌, రెమిషన్‌ లాంటి చర్యలను మరిచిపోలేమని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ట్విటర్లో స్పందించిన కేటీఆర్‌.. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు అభివృద్ధి, భద్రత, సంక్షేమంపై ఎన్నో హామీలు చూశామన్నారు. అయితే, ఇప్పుడు రేపిస్టులు, గర్భిణిలు, చిన్నారులను హత్య చేసిన వారిని విడుదల చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి ఖైదీల విడుదల, శిక్ష తగ్గింపు ఎప్పటికీ మరిచిపోలేమన్న ఆయన...  కర్మ సిద్ధాంతం ప్రకారం చేసింది తిరిగి అనుభవించాల్సిందేనని గుర్తు చేశారు. 

సీజేఐకు లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత

బిల్కిస్‌బానో అత్యాచార కేసులో దోషులను గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేయడంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. అత్యాచారం వంటి నేరాల్లో శిక్ష పడిన దోషులు స్వాతంత్ర్య దినోత్సవాన విడుదల కావడం ప్రజల వెన్నులో వణుకు పుడుతోందని లేఖలో పేర్కొన్నారు. సీబీఐ కేసుల్లో దోషులకు శిక్ష తగ్గింపు లేదా విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సీఆర్‌పీసీ చెబుతోందన్నారు. ఈ కేసులో దోషుల విడుదలకు గుజరాత్‌ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించిందో లేదో తెలియదన్నారు. శిక్ష తగ్గింపులో ప్రభుత్వాలు ఏకపక్షంగా అధికారాలను ఉపయోగించవద్దని, వాస్తవిక దృష్టితో చూడాలని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసిందన్నారు. రేపిస్టులు బయటకు రావడాన్ని, పూలదండలతో వారికి స్వాగతం పలకడాన్ని చూసి బానో మనసు ముక్కలై ఉంటుందన్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని దోషుల విడుదల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చర్యలు చేపట్టి, చట్టాలపై విశ్వాసాన్ని, మానవత్వాన్ని కాపాడాలని సీజేఐను కవిత కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని