Congress: ప్రజా వ్యతిరేక విధానాలను ఎదిరించేందుకు కాంగ్రెస్‌తో చేయి కలపాలి: మాణిక్‌ రావ్‌ ఠాక్రే

రాష్ట్రంలో రెండు రోజులపాటు సాగే హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌ (Haath Se Haath Jodo Abhiyan) పాదయాత్రలో పార్టీ ముఖ్య నేతలంతా పాల్గొంటారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌ రావు అన్నారు. పాదయాత్రను విజయవంతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated : 05 Feb 2023 22:09 IST

హైదరాబాద్‌: తెలంగాణలో సోమవారం నుంచి హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్ (Haath Se Haath Jodo Abhiyan) పాదయాత్రలు మొదలవుతాయని రాష్ట్ర కాంగ్రెస్‌ (congress) వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌ రావ్‌ ఠాక్రే (Manikrao Thakre) తెలిపారు. మూడు రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేసిన ఠాక్రే.. ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ విభాగాలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మేడారంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి(Revanth reddy), స్థానిక ముఖ్య నాయకులు కలిసి పాదయాత్రలో పాల్గొంటారని తెలిపారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చేసిన ప్రధాన ప్రసంగాలను, భాజపా గడిచిన 8ఏళ్లలో దేశంలో చేసిన ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ఛార్జ్‌ షీట్‌ రూపంలో జనంలోకి తీసుకెళ్తున్నట్లు వివరించారు.

కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అవినీతి, అక్రమాలు ప్రజా వ్యతిరేక విధానాలపై కూడా ఛార్జ్ షీట్ విడుదల చేశామని వాటన్నింటినీ జనంలోకి తీసుకెళ్తామని ఠాక్రే తెలిపారు. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నందున ఆయా సభ్యులు వెసులుబాటు చూసుకుని పాదయాత్రలో పాల్గొంటారని చెప్పారు. రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొంటున్నందున పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యే అవకాశం లేదని పేర్కొన్నారు. నాయకులందరూ వారి వారి నియోజక వర్గాల్లో పాదయాత్రలు చేస్తారని, వారి వారి అవకాశాలను బట్టి ఇతర ప్రాంతాల్లో కూడా పాల్గొంటారన్నారు. పాదయాత్రలో జనంతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటారని తెలిపారు. ప్రతి ఇంటికీ హాథ్‌ సే హాథ్‌ జోడో పోస్టర్‌ను అంటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎదిరించేందుకు కాంగ్రెస్‌తో చేయి కలపాలని కోరారు. హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌ పాదయాత్రకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివస్తారని.. ఇది విజయవంతం అవుతుందని ఆయన అశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని