Munugode By Polls: మునుగోడు ఫలితం.. రౌండ్ల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లంటే..!

మునుగోడు ఉప ఎన్నికల్లో తెరాస విజయదుందుబి మోగించింది. సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై  తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. రౌండ్ల వారీగా ఫలితాలను ఓసారి పరిశీలిస్తే..

Updated : 06 Nov 2022 20:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మునుగోడు ఉప ఎన్నికల్లో తెరాస విజయదుందుబి మోగించింది. సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై  తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు.తొలి మూడు రౌండ్లలో తెరాస, భాజపా మధ్య పోరు హోరాహోరిగా సాగినప్పటికీ క్రమంగా విజయం తెరాస చేతుల్లోకి వెళ్లిపోయింది. మొత్తం 15 రౌండ్లలో లెక్కింపు నిర్వహించారు. రౌండ్ల వారీగా ఫలితాలని ఓసారి పరిశీలిస్తే..

కీలకమైన చౌటుప్పల్‌ మండలంలోని ఓట్లను తొలి నాలుగు రౌండ్లలో లెక్కించారు. మొదటి రౌండ్‌లో తెరాస 6418 ఓట్లు సాధించగా, భాజపా 5,126, కాంగ్రెస్‌ 2100 ఓట్లు సాధించాయి. అయితే రెండు, మూడు రౌండ్లలో భాజపా ఆధిక్యం ప్రదర్శించింది. రెండో రౌండ్‌లో తెరాస 7,781 ఓట్లు సాధించగా, భాజపా 8,622, కాంగ్రెస్‌ 1,537 ఓట్లు సాధించాయి. మూడో రౌండ్‌లో తెరాస 7,390 ఓట్లు సాధించగా.. భాజపాకు 7,426, కాంగ్రెస్‌కు 1,926 ఓట్లు పోలయ్యాయి. దీంతో తొలి మూడు రౌండ్లు పూర్తయే సరికి తెరాస 415 ఓట్ల ఆధిక్యంలో నిలిచింది. అక్కడి నుంచి చివరి రౌండ్‌లో మినహా ప్రతి రౌండ్‌లోనూ గులాబీ పార్టీయే పై చేయి సాధించింది. క్రమంగా ఆధిక్యాన్ని పెంచుకుంటూ చివరికి10,309  ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేసింది. 

  • నాలుగో రౌండ్‌లో తెరాస 4854 ఓట్లు సాధించగా, భాజపా 4555, కాంగ్రెస్‌ 1817 ఓట్లు సాధించాయి. నాలుగో రౌండ్‌ పూర్తయ్యేసరికి  తెరాస 714 ఓట్ల ఆధిక్యంలో నిలిచింది.
  • ఐదో రౌండ్‌లో తెరాసకు 6162, భాజపాకు 5245, కాంగ్రెస్‌కు 2683 ఓట్లు వచ్చాయి. దీంతో తెరాస 1631 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చింది.
  • ఆరో రౌండ్‌లోనూ తెరాస పార్టీయే ఆధిక్యం ప్రదర్శించింది. ఈ రౌండ్‌లో తెరాస 6016 ఓట్లు సాధించగా, భాజపా 5378, కాంగ్రెస్‌ 1962 ఓట్లు సాధించాయి. ఆరు రౌండ్లు పూర్తయ్యే సరికి తెరాస ఆధిక్యం 2169కి చేరింది.
  • ఏడో రౌండ్‌లో తెరాస 7202 ఓట్లు సాధించింది.భాజపాకు 6803, కాంగ్రెస్‌కు 1664 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి తెరాస 2555 ఓట్లు ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
  • ఎనిమిదో రౌండ్‌లో తెరాసకు 6620 ఓట్లు రాగా.. భాజపాకు 6088, కాంగ్రెస్‌కు 907 ఓట్లు పోలయ్యాయి. 8 రౌండ్లు పూర్తయ్యేసరికి తెరాస 3091 ఓట్ల ఆధిక్యంలో నిలిచింది. మొత్తం 8 రౌండ్లలో తెరాస 45,723, భాజపా 43,115, కాంగ్రెస్‌ 13,689 ఓట్లు సాధించాయి.
  • తొమ్మిదో రౌండ్‌లోనూ తెరాస ఆధిక్యం ప్రదర్శించింది. గులాబీ పార్టీకి 7517 ఓట్లు రాగా.. భాజపా 6665, కాంగ్రెస్‌ 1684 ఓట్లు సాధించాయి. దీంతో తొమ్మిదో రౌండ్‌లో తెరాస 852 ఓట్ల ఆధిక్యం సాధించింది.
  • పదో రౌండ్‌లో తెరాసకు 7503, భాజపాకు 7015, కాంగ్రెస్‌కు 1347 ఓట్లు వచ్చాయి. 10 రౌండ్లు పూర్తయ్యే సరికి తెరాస 4416 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చింది.
  • 11వ రౌండ్‌లో తెరాస 7,214 ఓట్లు, భాజపా 5,853 ఓట్లు, కాంగ్రెస్ 1788 ఓట్లు సాధించాయి. మొత్తం 11 రౌండ్లు పూర్తయే సరికి తెరాస 67363, భాజపా 62923, కాంగ్రెస్‌ 17,627 ఓట్లు సాధించాయి. తెరాస 5,765 ఓట్ల అధిక్యంలో నిలిచింది.
  • 12వ రౌండ్‌లోనూ తెరాస ఆధిక్యం ప్రదర్శించింది. ఈ రౌండ్‌లో తెరాసకు 7,448, భాజపాకు 5,448, కాంగ్రెస్‌కు 1828 ఓట్లు వచ్చాయి. 12 రౌండ్లు పూర్తయినప్పటికి తెరాస 7836 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
  • 13వ రౌండ్‌తో తెరాస ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. 9136 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఈ రౌండ్‌లో తెరాస 6691, భాజపా 5346, కాంగ్రెస్‌1206 ఓట్లు సాధించాయి.
  • 14వ రౌండ్‌లోనూ తెరాస మరింత ఆధిక్యం దిశగా అడుగులు వేసింది. 14వ రౌండ్‌లో  తెరాసకు 6612, భాజపాకు 5,557, కాంగ్రెస్‌కు 1206 ఓట్లు పోలయ్యాయి. 14వ రౌండ్‌లో తెరాస 1055 ఓట్ల ఆధిక్యం ప్రదర్శించింది.
  • చివరి రౌండ్‌లో తెరాస 1270, భాజపా 1358, కాంగ్రెస్‌ 238 ఓట్లు సాధించాయి. ఈ రౌండ్‌లో భాజపా 88 ఓట్ల ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ.. 15 రౌండ్లలో కలిపి తెరాస 10,113 మెజార్టీ సాధించింది. పోస్టల్‌ బ్యాలెట్లు, సర్వీసు ఓట్లతో కలిపి 10,309 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.


రౌండ్ల వారీగా సాధించిన ఓట్లను పరిశీలిస్తే అధికార తెరాసకు భాజపా గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పాలి. నియోజకవర్గంలో మొత్తం 2,41,805 ఓటర్లు ఉండగా.. పోలింగ్‌ రోజున రికార్డు స్థాయిలో 2,25,192 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలైన మొత్తం ఓట్లలో తెరాస 97,006 ఓట్లు, భాజపా 86,697ఓట్లు, కాంగ్రెస్‌ 23,906 ఓట్లు సాధించాయి. 2014లో భాజపా-తెదేపా ఉమ్మడి అభ్యర్థి గంగిడి మనోహర్‌రెడ్డికి 27,434 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 97,239 ఓట్లు, తెరాస 74,687 ఓట్లు, భాజపా అభ్యర్థి 12,725 ఓట్లు సాధించారు.

అప్పట్లో కాంగ్రెస్‌, సీపీఐ..ఇప్పుడు తెరాస

1952 నుంచి చిన్నకొండూరు నియోజకవర్గంపేరుతో  ఉండగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా నాటి స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు. 1967లో మునుగోడు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత నుంచి జరిగిన 12 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆరుసార్లు విజయం సాధించగా సీపీఐ అయిదు సార్లు నెగ్గింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక తొలి ఎన్నికల్లో తెరాస విజయం సాధించింది. కాంగ్రెస్‌ అగ్రనేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి అయిదుసార్లు గెలవగా 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. సీపీఐ ముఖ్యనేత ఉజ్జిని నారాయణరావు 1985, 1989, 1994లలో గెలవగా పల్లా వెంకట్‌రెడ్డి 2004లో, ఉజ్జిని యాదగిరిరావు 2009లో విజయం సాధించారు. ఎక్కువ సార్లు కాంగ్రెస్‌, వామపక్షాల మధ్య పోటీ సాగింది. 1994లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి రెండో స్థానంలో నిలవగా 2014లో ఆయన కుమార్తె పాల్వాయి స్రవంతి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి రెండో స్థానంలో నిలిచారు. తాజా ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని