Revanth reddy: ఆగస్టు 5న తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు: రేవంత్‌రెడ్డి

ఏఐసీసీ పిలుపు మేరకు ఆగస్టు 5న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని కాంగ్రెస్‌ శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచించారు.

Published : 01 Aug 2022 01:45 IST

హైదరాబాద్‌: ఏఐసీసీ పిలుపు మేరకు ఆగస్టు 5న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని కాంగ్రెస్‌ శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచించారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసరాల ధరల పెంపు, ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, అగ్నిపథ్‌ తదితర అంశాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టనున్నట్టు వివరించారు. నిత్యావసరాలపై  జీఎస్టీ పెంపునకు నిరసనగా గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

‘‘రాష్ట్రంలో భారీ వరదలతో తీవ్ర నష్టం జరిగింది. 20లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు నాశనమయ్యాయి. రాష్ట్రంలో వరదలు, వర్షాల కారణంగా దాదాపు రూ.2వేల కోట్ల నష్టం జరిగింది. అయినా, కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎలాంటి చలనం లేదు. వరద బాధితులను ఆదుకోవడంలో రెండు ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలి, వరదల్లో మృత్యువాత పడ్డ కుటుంబాలను ఆదుకోవాలి. నియోజకవర్గ, జిల్లాస్థాయిలో కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులందరూ ధర్నాలో పాల్గొనాలి. జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలి. రాష్ట్ర రాజధానుల్లో పీసీసీ ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమాలు ఉంటాయి. ప్రజలు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనేలా కార్యాచరణ చేపట్టాలి’’ అని పార్టీ శ్రేణులకు రేవంత్‌ విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని