తక్షణమే ఆ చట్టాలను రద్దు చేయండి: రాహుల్‌

నూతన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్‌ అధినాయకుడు రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్విటర్‌ ద్వారా స్పందించారు. కేంద్ర వ్యవసాయ చట్టాలను రైతు వ్యతిరేక చట్టాలుగా రాహుల్‌ పేర్కొన్నారు.

Updated : 28 Jan 2021 13:21 IST

దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్విటర్‌ ద్వారా స్పందించారు. కేంద్ర వ్యవసాయ చట్టాలను రైతు వ్యతిరేక చట్టాలుగా రాహుల్‌ పేర్కొన్నారు. ‘వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని మరోసారి నేను నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కోరుతున్నా’ అని  ట్వీట్‌లో విజ్ఞప్తి చేశారు.  ఈ సందర్భంగా మహాత్మాగాంధీ చెప్పిన ఓ సూక్తిని రాహుల్ ప్రజలతో పంచుకున్నారు. ‘సున్నితమైన మార్గంలో మీరు ప్రపంచాన్ని కదిలించవచ్చు’ అనే సూక్తిని ట్వీట్‌లో షేర్‌ చేశారు. 

రాజకీయాలు చేయొద్దు: ఫడణవీస్‌
దిల్లీలో గణతంత్ర దినోత్సవం రోజున రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ ఉద్రిక్తత అంశంపై ఎవరూ రాజకీయాలు చేయవద్దని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ విజ్ఞప్తి చేశారు. ఈ అంశం దేశానికి సంబంధించింది.. కాబట్టి రాజకీయాలు చేయవద్దని పేర్కొన్నారు.  ఈ మేరకు ఆయన బుధవారం ఓ మీడియాతో వెల్లడించారు. ఈ సందర్భంగా ఫడణవీస్‌ రైతుల ఆందోళనలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయడాన్ని తీవ్రంగా ఖండించారు. ‘దేశ రాజధాని దిల్లీలో నిన్న జరిగిన ఘటన సరైంది కాదు. కాబట్టి ఆ హింసాత్మక ఘటనలపై ఎవరూ రాజకీయాలు చేయరు అని నేను భావిస్తున్నా. ఈ హింసాత్మక ఘటనలతో రైతుల ఆందోళనలు విశ్వాసాన్ని కోల్పోయాయి. ఇందుకు దారి తీసిన పరిస్థితులపై నిరసనలకు నాయకత్వం వహించిన రైతు సంఘాల నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి’ అని సూచించారు. 

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం రోజున రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే.  రైతులు ఎర్రకోటపై  రైతు జెండాలను ఎగురవేశారు. ఈ ఘటనలో 300 మంది పోలీసులకు గాయాలైనట్లు దిల్లీ పోలీసు శాఖ వెల్లడించింది. ఘటనకు బాధ్యులుగా అనుమానిస్తున్న 200 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 22 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. 

ఇదీ చదవండి

దిల్లీ ఆందోళనలపై ఐరాస స్పందన


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని