KTR farmhouse Case: జన్వాడ ఫాంహౌస్‌పై వాస్తవాన్ని ప్రజాకోర్టు తేల్చాలి: రేవంత్‌రెడ్డి

జన్వాడ ఫాంహౌస్‌ కేసులో హైకోర్టు తీర్పుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్విటర్‌ ద్వారా స్పందించారు. శంకరపల్లి మండలం జన్వాడ వద్ద జీవో 111కు విరుద్ధంగా ఫాంహౌస్‌ నిర్మించారంటూ

Published : 28 Apr 2022 16:46 IST

హైదరాబాద్‌: జన్వాడ ఫాంహౌస్‌ కేసులో హైకోర్టు తీర్పుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్విటర్‌ ద్వారా స్పందించారు. శంకరపల్లి మండలం జన్వాడ వద్ద జీవో 111కు విరుద్ధంగా ఫాంహౌస్‌ నిర్మించారంటూ 2020లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెన్నై ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ‘‘జన్వాడ ఫాంహౌస్‌ డ్రోన్ కేసులో కేటీఆర్‌కు హాని తలపెట్టానని నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఫాంహౌస్‌లో కేటీఆర్ ఉంటున్నారని పోలీసులు కోర్టుకు తెలిపారు. జన్వాడ ఫాంహౌస్‌ తనది కాదని కేటీఆర్‌ కోర్టులో చెప్పారు. కేటీఆర్‌ వాదనకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. జన్వాడ ఫాంహౌస్‌పై వాస్తవాన్ని ప్రజాకోర్టు తేల్చాలి’’ అని రేవంత్‌ ట్వీట్‌ చేశారు.

రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ మీర్జాగూడలో జీవో 111కు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారన్న ఆరోపణలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ నోటీసులు జారీ చేసిన కేసులో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు ఊరట లభించిన విషయం తెలిసిందే. ఎన్జీటీ నోటీసులు జారీ చేయడంతో పాటు సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తూ ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ మంత్రి కేటీఆర్‌తో పాటు ఫాంహౌస్‌ యజమాని ప్రదీప్‌రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారించిన హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఫాంహౌస్‌ నిర్మాణంపై ఎన్జీటీలో దాఖలు చేసిన పిటిషన్‌ విచారణార్హం కాదని తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పుపై స్పందిస్తూ రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.

జీవో 111కు విరుద్ధంగా మంత్రి కేటీఆర్‌ ఫాంహౌస్‌ నిర్మించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 2020లో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ 2020 జూన్‌ 5న కేటీఆర్‌కు నోటీసులు జారీ చేస్తూ పరిశీలించడానికి సంయుక్త కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ మంత్రి కేటీఆర్‌, ప్రదీప్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు సుదీర్ఘ వాదనలు విని ఫిబ్రవరిలో తీర్పు వాయిదా వేసింది. బుధవారం తీర్పు వెలువరిస్తూ ఎన్జీటీలో పిటిషన్‌ విచారణార్హం కాదని తేల్చి చెప్పింది. ఎన్జీటీ చట్టం ప్రకారం నిర్మాణం జరిగిన ఆరు నెలల్లో పిటిషన్‌ దాఖలు చేయాల్సి ఉందని... దానికి విరుద్ధంగా ఎప్పుడో జరిగిన నిర్మాణాలపై ఇప్పుడు పిటిషన్‌ దాఖలు చేయడం చెల్లదని తెలిపింది. ఫాంహౌస్‌ నిర్మాణంతో కేటీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదంటున్నప్పుడు ఆయనకు నోటీసులు కూడా జారీ చేయకుండా కమిటీని ఏర్పాటు చేయడం సరికాదంది. ఈ పిటిషన్‌లో అసలైన యజమాని ప్రదీప్‌రెడ్డిని ప్రతివాదిగా పేర్కొనలేదంది. ఎన్జీటీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునే పరిధి హైకోర్టుకు లేదన్న రేవంత్‌రెడ్డి వాదనను తోసిపుచ్చింది. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేసినప్పుడు హైకోర్టు విచక్షణాధికారాన్ని వినియోగించి జోక్యం చేసుకోవచ్చని ఆ పరిధి తమకుందని స్పష్టం చేసింది. ఎన్జీటీలో రేవంత్‌రెడ్డి పిటిషన్‌ విచారణార్హం కాదంటూ కేటీఆర్‌, ప్రదీప్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లను అనుమతించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు