Sajjala: అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తుందనే వార్తలు ఊహాజనితమే: సజ్జల

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి ఎక్కడికో పారిపోతున్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

Updated : 19 May 2023 18:54 IST

అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి ఎక్కడికో పారిపోతున్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కన్న తల్లికి అనారోగ్యంగా ఉందని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అవినాష్‌ రెడ్డికి లేదన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సజ్జల మీడియాతో మాట్లాడారు.

‘‘సీబీఐ ముందు విచారణకు హాజరయ్యేందుకే అవినాష్ రెడ్డి హైదరాబాద్ వెళ్లారు. సీబీఐ అధికారులు పిలిచిన ప్రతిసారి అవినాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఇవాళ తన తల్లి ఆరోగ్యం బాగోలేదని తెలిసి హైదరాబాద్‌ నుంచి పులివెందులకు బయలుదేరారు. ఊహించని విధంగా ఇవన్నీ జరిగిపోయాయి. అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తుందనే వార్తలు కేవలం ఊహాజనితాలు మాత్రమే. మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. వివేకా హత్య కేసులో అవినాష్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఆయన రేపైనా సీబీఐ విచారణకు హాజరవుతారు.. హాజరు కావాల్సిందే. వివేకానందరెడ్డిని నరికిన వ్యక్తి మీడియా సమావేశాలు పెడుతున్నారు. బెయిల్ తీసుకుని స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వివేకా హత్య కేసుతో ఎలాంటి సంబంధం లేని వారిని వేధిస్తున్నారు. దర్యాప్తు విషయంలో సీబీఐకి సహకరిస్తోన్న ఒక బాధ్యతగల ఎంపీ విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నారు. తల్లి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చిత్రీకరించే దౌర్భాగ్యం అవినాష్‌కు లేదు’’ అని సజ్జల అన్నారు.

అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు వదిలేవారా?

‘‘అవినాష్ రెడ్డి ఎక్కడికో పారిపోతున్నట్లుగా ఓ మీడియా సంస్థకు చెందిన వాహనం వెంబడించింది. ఆయనను నేరస్థుడిగా చూపే విధంగా ప్రయత్నించడం సరికాదు. అయినప్పటికీ మీడియా సంస్థకు చెందిన వాహనంపై దాడి జరగడం దురదృష్టకరం. దాడి విషయం అవినాష్‌కు తెలిసి ఉండకపోవచ్చు. వివేకా హత్యలో అవినాష్ రెడ్డి ప్రమేయం ఉంటే అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు వదిలేవారా? హత్య అనంతరం రక్తపు మరకలు ఎవరు తుడిచారో అందరికీ తెలుసు. వివేకా రాసినట్లు చెబుతోన్న లేఖను ఎవరు.. ఎందుకు.. దాచారో కూడా ఇప్పటికే బహిర్గతం అయింది. చంద్రబాబు హయాంలో వివేకా హత్య కేసు అనుమానితులను ఎందుకు అరెస్టు చేయలేదు? తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరు. అసలు విషయం వెలుగులోకి వచ్చేలోగా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సరైంది కాదు’’ అని సజ్జల వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని