సుబ్బారావుకు భూమి లేకుంటే ‘పీఎం కిసాన్‌’ ఎందుకొస్తుంది?: ఎంపీ సంజీవ్‌ కుమార్‌

భూ సమస్య కారణంగా ఆత్మహత్య చేసుకున్నవారిపై అభాండాలు వేయడం హేయమైన చర్య అని తెదేపా నేత, కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌ అన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో బాధిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. 

Published : 25 Mar 2024 14:06 IST

ఒంటిమిట్ట: భూ సమస్య కారణంగా ఆత్మహత్య చేసుకున్నవారిపై అభాండాలు వేయడం హేయమైన చర్య అని తెదేపా నేత, కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌ అన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో బాధిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ నెల 23న తెల్లవారుజామున కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. తమ భూమి రికార్డులను రెవెన్యూ అధికారులు వేరే వాళ్ల పేరుపై మార్చారని చేనేత కార్మికుడు సుబ్బారావు రైలు కిందపడి తనువు చాలించారు. ఆయన భార్య పద్మావతి, కుమార్తె వినయ ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఈ నేపథ్యంలో సుబ్బారావు పెద్ద కుమార్తెను సంజీవ్‌ పరామర్శించి మాట్లాడారు. ముగ్గురు చనిపోవడానికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ‘‘డబ్బుకు ఆశపడి సుబ్బారావుకు చెందిన భూమిని కట్టా శ్రావణి పేరు మీదికి మార్చారు. ఆయన 8 ఏళ్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. అతడి పేరు మీద భూమి లేదని పోలీసులు చెప్పడం విడ్డూరం. భూమి లేకుంటే పీఎం కిసాన్‌ పెట్టుబడి సహాయం ఎందుకొస్తుంది? వైకాపా నేతలకు భయపడి అధికారులు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు’’ అని సంజీవ్‌ కుమార్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని