Maharashtra Crisis: కొనసాగుతోన్న ‘మహా’ ఉత్కంఠ.. ఉద్ధవ్‌కు పవార్‌ కీలక సూచన!

శివసేనలో అసమ్మతి భగ్గుమనడంతో మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. మంత్రి ఏక్‌నాథ్‌ శిందే తన వర్గం ఎమ్మెల్యేలతో తిరుగుబావుటా .....

Published : 23 Jun 2022 01:18 IST

సీఎం నివాసంలో ముగిసిన కీలక భేటీ

ముంబయి: శివసేనలో అసమ్మతి భగ్గుమనడంతో మహారాష్ట్ర రాజకీయాలు (Maharashtra Politics) ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. మంత్రి ఏక్‌నాథ్‌ శిందే తన వర్గం ఎమ్మెల్యేలతో తిరుగుబావుటా ఎగురవేయడంతో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ సారథ్యంలో ఏర్పాటైన మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వ మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్ భేటీ అయ్యారు. సుప్రియా సూలే, జితేంద్ర అవద్‌తో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన పవార్‌.. దాదాపు గంట పాటు మంతనాలు జరిపారు. సమావేశం అనంతరం పవార్‌, సుప్రియా సూలేతో కలిసి తన నివాసం నుంచి బయటకు వచ్చిన సీఎం ఉద్ధవ్‌ తన మద్దతుదారులకు అభివాదం చేశారు. అయితే, ఈ కీలక భేటీలో శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందేను ముఖ్యమంత్రి చేయాలని శరద్‌ పవార్‌, కాంగ్రెస్‌ సూచించినట్టు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా.. ఏక్‌నాథ్‌ శిందే వైపు వెళ్తున్న ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు నలుగురు స్వతంత్రులతో కలిపి 34మంది ఎమ్మెల్యేలు ఆయన వైపు నిలవగా.. తాజాగా మరో ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు చార్టర్డ్‌ విమానంలో గువాహటికి చేరుకున్నట్టు సమాచారం.

ఉద్ధవ్‌ ప్రసంగం తర్వాత ఏక్‌నాథ్‌ ట్వీట్‌

మరోవైపు, శివసేన మనుగడ కోసం అసహజమైన పొత్తు నుంచి బయటపడటం ఎంతో అవసరమని ఆ పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన నేత ఏక్‌నాథ్‌ శిందే అన్నారు. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఫేస్‌బుక్‌ లైవ్‌లో ప్రసంగించిన అనంతరం ఆయన ట్విటర్‌లో స్పందించారు. మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వంలో కేవలం కాంగ్రెస్‌, ఎన్సీపీలే లబ్ధి పొందాయని.. శివసైనికులు మునిగిపోయారన్నారు. పార్టీ, శివసైనికుల మనుగడ కోసం అసహజమైన కూటమి నుంచి బయటపడటం అవసరమని పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 

శిందేతో మేం మాట్లాడలేదు: భాజపా నేత దాన్వే
శివసేన ఎమ్మెల్యేలెవరూ తమతో టచ్‌లో లేరని భాజపా నేత రావు సాహెబ్‌ పాటిల్‌ దన్వే తెలిపారు. ఏక్‌నాథ్‌ శిందేతో తాము మాట్లాడలేదన్నారు. ఇది శివసేన అంతర్గత వ్యవహారమని.. ఇందులో భాజపాకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. 

మరోవైపు, ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొనేందుకు భాజపా డబ్బు, దర్యాప్తు సంస్థలను వినియోగించడమే పెద్ద సమస్యగా మారిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ ఆరోపించారు. మహారాష్ట్రలో సంక్షోభంపై ఆయన స్పందిస్తూ.. ‘‘ఇది శివసేన అంతర్గత సమస్య. ఆ పార్టీ నాయకత్వం దీన్ని సులువుగా పరిష్కరించగలదు. కానీ ఇక్కడ భాజపా తీరుతోనే పెద్ద సమస్య. ఎమ్మెల్యేలను లాక్కొనేందుకు డబ్బును, దర్యాప్తు సంస్థలను వినియోగిస్తోంది. శివసేన మనుగడ సాగిస్తుందని భావిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు.


‘మహా’ Updates..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని