Navjot Singh Sidhu: పంజాబ్‌లో చతికిలబడిన కాంగ్రెస్‌.. చిత్రంగా స్పందించిన సిద్ధూ..!

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ధాటికి అధికార కాంగ్రెస్ చతికిలపడింది. ముఖ్యమంత్రిగా ఉన్న చరణ్‌జిత్‌ సింగ్ చన్నీ, నవజ్యోత్‌సింగ్ సిద్ధూతో సహా బడా నేతలంతా ఇంటిబాటపట్టారు.

Published : 11 Mar 2022 17:26 IST

చండీగఢ్‌: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ధాటికి అధికార కాంగ్రెస్ చతికిలపడింది. ముఖ్యమంత్రిగా ఉన్న చరణ్‌జిత్‌ సింగ్ చన్నీ, నవజ్యోత్‌సింగ్ సిద్ధూతో సహా బడా నేతలంతా ఇంటిబాటపట్టారు. ఈ భారీ ఓటమిపై సిద్ధూ కాస్త విచిత్రంగానే స్పందించారు.  కొత్త వ్యవస్థకు నాంది పలికే క్రమంలో ఈ అద్భుత నిర్ణయం తీసుకున్న ప్రజలను అభినందించాలనుకుంటున్నట్లు వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో ఉన్న ఆయన నుంచి ఆ మాటలు రావడంతో మీడియా వర్గాలు ఆశ్చర్యపోయాయి. అధ్యక్షుడిగా తమరే ఈ మాట అన్నారేంటని ప్రశ్నించగా.. ‘ప్రజలు మార్పు కోరుకున్నారు. వారు తప్పు చేయరు. ప్రజల తీర్పే దేవుడి తీర్పు. మనం దానిని వినయంతో అంగీకరించాలి’ అని సమర్థించుకున్నారు.

అలాగే పంజాబ్ అభివృద్ధి కోసం తన ప్రయత్నాలు కొనసాగుతాయని వెల్లడించారు. ‘ఒక యోగి ధర్మయుద్ధంలో ఉన్నప్పుడు తనకు హద్దులు గీసుకోడు. మరణం గురించి భయపడడు. నేను పంజాబ్‌లోనే ఉన్నాను.. ఉంటాను. పెద్ద లక్ష్యాలు నిర్ణయించుకున్నవారు.. గెలుపోటముల గురించి పట్టించుకోరు’ అని వ్యాఖ్యానించారు. తనను కిందికి తోయాలని చూసిన కొందరు.. ప్రజల చేతిలో ఓటమి పాలయ్యారంటూ విమర్శలు చేశారు. 

అయితే ఓటమికి బాధ్యత తీసుకునే విషయంలో మాత్రం వెనకడుగు వేశారు. ‘నేను ముఖ్యమంత్రి అభ్యర్థి కానందున పంజాబ్‌ అంతటా ప్రచారం చేసే అధికారం నాకు లేదు. ఇది చన్నీ బాధ్యత. చన్నీని రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పుడే.. ప్రచారం మొత్తం ఆయన బాధ్యతే అని నేను చెప్పేశాను. అయితే చన్నీని ప్రజలు అంగీకరించారా..? లేదా..? అనే విషయంపై నేను వ్యాఖ్యలు చేయను’ అని కాంగ్రెస్ పరాభవానికి చన్నీని బాధ్యుడిని చేసే ప్రయత్నం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని