Smriti Irani: ఓటమిని ముందే అంగీకరించారు.. రాహుల్‌కు స్మృతీ ఇరానీ కౌంటర్‌

అమేఠీ ప్రజల తీర్పును ముందే ఊహించిన కాంగ్రెస్‌ తమ అభ్యర్థిని ప్రకటించే ధైర్యం చేయలేకపోతోందని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ విమర్శించారు. 

Published : 07 Mar 2024 17:22 IST

అమేఠీ: లోక్‌సభ ఎన్నికల్లో (LokSabha Elections 2024) అమేఠీలో భాజపా (BJP) విజయం ఖాయమైందని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ (Smriti Irani) ధీమా వ్యక్తం చేశారు. ప్రజల తీర్పును ఊహించిన కాంగ్రెస్ (Congress) అభ్యర్థిని ప్రకటించకుండా తాత్సారం చేస్తుందని ఎద్దేవా చేశారు. గురువారం నియోజకవర్గంలో రూ.206 కోట్ల విలువైన 281 ప్రాజెక్టులకు ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

‘‘అమేఠీ నియోజకవర్గం గాంధీ కుటుంబం కంచుకోట అని కాంగ్రెస్‌ ప్రచారం చేసుకుంటోంది. అది నిజమే అయితే, ఇప్పటిదాకా ఆ పార్టీ అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదు? ప్రజల తీర్పు ఏంటో వాళ్లకి బాగా తెలుసు. అందుకే అభ్యర్థిని ప్రకటించే ధైర్యం చేయలేకపోతోంది. ఇది ఆ పార్టీ ఓటమికి స్పష్టమైన సంకేతం. రాహుల్‌ గాంధీ రెండు చోట్లా పోటీ చేస్తున్నారంటే.. ఎన్నికలకు ముందే అమేఠీలో ఓటమిని అంగీకరించినట్లే. ఆయనకు ధైర్యం ఉంటే మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌ మద్దతు లేకుండా ఒంటరిగా ఇక్కడ నుంచి పోటీ చేయాలి’’ అని స్మృతి ఇరానీ అన్నారు.

2014 ఎన్నికల్లో అమేఠీ నుంచి పోటీ చేసిన ఆమె ఓటమి పాలయ్యారు. అనంతరం 2019లో రాహుల్‌పై విజయం సాధించారు. తాజాగా మరోసారి ఇక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే, రాహుల్‌ గాంధీ మరోసారి అమేఠీ నుంచి పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రదీప్‌ సింఘాల్‌ బుధవారం వెల్లడించారు. దీంతోపాటు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్‌ నుంచి కూడా పోటీ చేయనున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని