Rajasthan: రాజస్థాన్‌ రాజకీయాల్లో హైడ్రామా.. కొత్త సీఎంపై ఉత్కంఠ?

రాజస్థాన్‌(Rajasthan) రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. కాంగ్రెస్‌(Congress) అధ్యక్ష పగ్గాల్ని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ చేపడితే.. ఆయన....

Updated : 25 Sep 2022 23:31 IST

జైపూర్‌: రాజస్థాన్‌(Rajasthan) రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది.  కాంగ్రెస్‌(Congress) అధ్యక్ష పగ్గాల్ని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ చేపడితే.. ఆయన స్థానంలో కొత్తగా ఎవరికి సీఎం పగ్గాలు అప్పగించాలో నిర్ణయించేందుకు జరగాల్సిన సీఎల్పీ భేటీకి ముందు జరుగుతున్న పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాజస్థాన్ తదుపరి సీఎంగా ఆ పార్టీ సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌కు ఛాన్స్‌ ఇవ్వాలని ఒకవేళ కాంగ్రెస్‌ అధిష్ఠానం భావించినా.. ఆ ప్రక్రియ అంత సజావుగా సాగేలా కనబడటం లేదు. తమ వర్గానికి చెందిన వ్యక్తికే సీఎం పీఠం అప్పగించాలని అశోక్‌ గహ్లోత్‌ మద్దతుదారులు డిమాండ్‌ చేస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. రాజస్థాన్‌లో సీఎం అశోక్‌ గహ్లోత్‌, డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ వర్గాల మధ్య ఎప్పట్నుంచో విభేదాలు కొనసాగుతున్న వేళ తాజా పరిణామాలతో మరోసారి అక్కడి రాజకీయాలు వేడెక్కాయి. పైలట్‌కు సీఎం పీఠం అప్పగిస్తే 90మందికి పైగా గహ్లోత్‌ వర్గం ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధమని హెచ్చరిస్తున్నట్టు వస్తోన్న వార్తలు కాంగ్రెస్‌లో సరికొత్త సంక్షోభానికి దారితీసేలా ఉంది.  

స్పీకర్‌కు రాజీనామాలు సమర్పించిన గహ్లోత్‌ వర్గం ఎమ్మెల్యేలు?

2020లో సచిన్‌ పైలట్‌ తన మద్దతుదారులైన 18మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేసిన సమయంలో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన 102 మంది ఎమ్మెల్యేల్లో ఒకరు సీఎం కావాలని అశోక్‌ గహ్లోత్‌ వర్గానికి చెందిన 56మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, గహ్లోత్‌ వారసుడిగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై ప్రతిష్టంభన వీడకపోవడంతో ఈ రోజు 7గంటలకు సీఎం నివాసంలో జరగాల్సిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల భేటీ ఆలస్యమైంది. మరికాసేపట్లో ఈ కీలక సమావేశం మొదలయ్యే అవకాశం ఉంది. ఈ భేటీలో కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి పరిశీలకులుగా మల్లిఖార్జున ఖర్గే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి అజయ్‌ మాకెన్‌ హాజరుకానున్నారు. అశోక్‌ గహ్లోత్‌ వర్గం ఎమ్మెల్యేలు తమ రాజీనామాలు సమర్పించేందుకు స్పీకర్‌ని కలవడానికి చేరుకున్నట్లు సమాచారం. మరోవైపు గహ్లోత్‌తో భేటీకోసం సచిన్‌ పైలట్‌ ఆయన ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది.

పైలట్‌కు వ్యతిరేకంగా గహ్లోత్‌ వర్గం వ్యాఖ్యలు

ఇంకోవైపు, ఏఐసీసీ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో నామినేషన్‌ వేసే నాటికి గహ్లోత్‌ రాజస్థాన్‌ ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి.  ఎందుకంటే ఆ పార్టీ తీసుకున్న ‘ఒక్కరికి ఒకే పదవి’ విధానం ఆధారంగా ఆయన సీఎం పదవి నుంచి దిగిపోక తప్పదంటున్నారు. దీంతో తదుపరి సీఎంగా సచిన్‌ పైలట్‌కు అవకాశం దక్కనుందన్న ఊహాగానాల నేపథ్యంలో  ఈ సాయంత్రం మంత్రి శాంతి దారివాల్‌ ఇంట్లో అశోక్‌ గహ్లోత్‌ నలుగురు మంత్రులతో పాటు తన సన్నిహితులతో కీలక భేటీ నిర్వహించారు. సచిన్‌ పైలట్‌ సీఎం కాకుండా అడ్డుకొనే ప్రయత్నంలో భాగంగానే వీరంతా భేటీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. 2020లో రాజకీయ సంక్షోభం ఎదురైనప్పుడు ప్రభుత్వాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషించిన వారే తదుపరి సీఎం అవ్వాలి తప్ప  కూల్చివేతలో భాగస్వాములు సీఎం కాకూడదంటూ గహ్లోత్‌ వర్గానికి చెందిన పలువురు నేతలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. 2018 డిసెంబర్‌లో జరిగిన రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిన వెంటనే సీఎం పదవి కోసం గహ్లోత్‌, పైలట్‌ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రంగంలోకి దిగిన కాంగ్రెస్‌ అధిష్ఠానం అశోక్‌ గహ్లోత్‌కు సీఎం పదవికి ఎంపిక చేయగా.. పైలట్‌ను డిప్యూటీ సీఎంని చేసి వివాదానికి తాత్కాలిక విరామం పలికింది.

అలా చేయకపోతే ప్రభుత్వ మనుగడ ప్రమాదమే.. 

మరోవైపు, ఎమ్మెల్యేల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోకపోతే ప్రభుత్వం ప్రమాదంలో పడుతుందని స్వతంత్ర ఎమ్మెల్యే, సీఎంకు సలహాదారు సన్యం లోధా అన్నారు. గహ్లోత్‌తో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. మరో నేత గోవింద్‌ రామ్‌ మేఘ్వాల్‌ మాట్లాడుతూ.. అశోక్‌ గహ్లోత్‌ సీఎంగా, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ద్విపాత్రాభినయం చేయగలరన్నారు. గహ్లోత్‌ని సీఎంగా కొనసాగించకపోతే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడంలో పార్టీ పెద్ద సమస్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. సీఎల్పీ సమావేశంలో తన వారసుడిగా ఎవరిని ఉంచాలనే అంశంపై పార్టీ చీఫ్‌ నిర్ణయం పట్ల విశ్వాసం ప్రకటిస్తూ ఎమ్మెల్యేలంతా ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉందని గహ్లోత్‌ ఈ సాయంత్రం మీడియాకు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని