Prashanth Reddy: ప్రతిపక్షాలు బురద రాజకీయాలు చేస్తున్నాయి: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

తెలంగాణలో వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై శాసనమండలిలో చర్చ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు.

Updated : 03 Aug 2023 16:53 IST

హైదరాబాద్: తెలంగాణలో ఎప్పుడూ లేనంతగా భారీ వర్షాలు నమోదయ్యాయని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే ఊహించలేమని.. అయితే, వీలైనంత వరకు తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయవచ్చన్నారు. తెలంగాణలో వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై శాసనమండలిలో చర్చ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు.

‘‘జులై 20 నుంచి 28 వరకు 8రోజుల్లో 66శాతం వర్షం కురిసింది. వెంటనే ప్రభుత్వం అప్రమత్తమైంది. గోదావరి పరివాహక ప్రాజెక్టుల వారీగా  సీఎం కేసీఆర్‌ మానిటరింగ్‌ చేశారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టం తగ్గించడంలో కృషి చేశారు. విపత్తును అంచనా వేస్తూ మానిటరింగ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ ఫొటోలకు ఫోజులు ఇచ్చే నాయకుడు కాదు. 8 ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌లను అందుబాటులో ఉంచారు. మోరంచపల్లికి హెలికాప్టర్‌, ఆర్మీని కూడా అందుబాటులోకి తెచ్చారు. 1500 మందిని ఫైర్‌ టీమ్స్‌ కాపాడాయి.139 గ్రామాలు వరద ముంపు భారిన పడ్డాయి. 27వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించాం.

ప్రతిపక్షాలు బురద రాజకీయాలు చేస్తున్నాయి. విద్యుత్‌శాఖ సిబ్బంది ఈదుకుంటూ వెళ్లి విద్యుత్‌ పునరుద్ధరించారు. విద్యుత్‌ సిబ్బందికి సెల్యూట్‌. 756 చెరువులకు గండ్లు పడ్డాయి.768 ప్రాంతాల్లో ఆర్‌అండ్‌బీ రోడ్లు కోతకు గురయ్యాయి. ఆర్‌అండ్‌బీ  రోడ్లకు తాత్కాలిక మరమ్మతులకు రూ.253 కోట్లు, పూర్తి స్థాయిలో పునరుద్ధరణకు రూ.1,231 కోట్లు అవసరం. 1190 ప్రాంతాల్లో మిషన్‌ భగీరథ పైపులు దెబ్బతిన్నాయి. 419 గృహాలు పూర్తిగా కూలిపోయాయి. వారు పేదలైతే గృహలక్ష్మి పథకం కింద ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించాం. దురదృష్టవశాత్తూ కేంద్రం ఎటువంటి సాయం అందించలేదు. పంట నష్టంపై పూర్తి స్థాయి నివేదిక అందగానే సీఎం నిర్ణయం తీసుకుంటారు’’ అని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని