
TS News: జగ్గారెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘించినట్టు భావిస్తున్నాం: చిన్నారెడ్డి
హైదరాబాద్: ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘించినట్టు భావిస్తున్నామని కాంగ్రెస్‌పార్టీ స్పష్టం చేసింది. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో సమావేశమైన నేతలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏమైనా విభేదాలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని స్పష్టం చేశారు. జగ్గారెడ్డిని త్వరలోనే కమిటీ ముందుకు పిలుస్తామని చిన్నారెడ్డి వెల్లడించారు. జగ్గారెడ్డిపై చర్యల అంశం తమ పరిధిలో లేదని .. సోనియాకు జగ్గారెడ్డి రాసిన లేఖ బహిర్గతంపై తెలుసుకుంటామని చెప్పారు. ఇటీవల పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. అంత పెద్ద కార్యక్రమాన్ని తనతో చర్చించలేదని జగ్గారెడ్డి అసంతృప్తి వెలిబుచ్చారు. పీసీసీ అధ్యక్షుడి తీరును తప్పుబడుతూ సోనియాగాంధీకి లేఖ రాశారు. గతంలోనూ రేవంత్‌రెడ్డి సారథ్యంపై జగ్గారెడ్డి నిరసన తెలిపారు. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయబోనని ప్రకటించిన అప్పట్లో క్షమాపణలు కూడా చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఆయన వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
‘‘టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నాం. కొత్త సంవత్సరంలో కొత్త సంస్కృతిని ఆచరిస్తారని ఆశిస్తున్నాం. జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డికి ఇచ్చిన నోటీసుపై వివరణ ఇచ్చారు. లోతుగా చర్చించాం, కానీ కమిటీ సంతృప్తి చెందలేదు. మళ్లీ ఒకసారి రాఘవరెడ్డితో మాట్లాడాలని కమిటీ భావిస్తోంది. మంచిర్యాల జిల్లా మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు అనుచరులు వీహెచ్ వాహనంపై దాడి చేయడంపై ప్రేమ్‌సాగర్‌రావుతో చర్చించాలని భావిస్తున్నాం. దాడి సమయంలో ప్రేమ్ సాగర్‌రావు ప్రత్యక్షంగా అక్కడ లేరు. పార్టీలో కొన్ని ప్రాంతాల్లో గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో అలాంటి పరిస్థితి ఉన్నట్టు కమిటీ దృష్టికి వచ్చింది.2018 ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన వారిని పార్టీ సస్పెండ్‌చేసింది. వారు మళ్లీ తిరిగి పార్టీలోకి వస్తామని విజ్ఞప్తులు వస్తున్నాయి. వాటిని టీపీసీసీకి అందజేస్తాం’’ అని చిన్నారెడ్డి తెలిపారు.