UP Polls: యూపీ+యోగి= ఉపయోగి.. యోగి పాలనకు మోదీ సరికొత్త నిర్వచనం

కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న ఉత్తర్‌ ప్రదేశ్‌లో ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. మరికొన్నింటికి శ్రీకారం చుడుతున్నారు.

Published : 19 Dec 2021 01:29 IST

లఖ్‌నవూ: కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న ఉత్తర్‌ ప్రదేశ్‌లో ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. మరికొన్నింటికి శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలో శనివారం రూ.36,230 కోట్ల విలువైన గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుకు పునాది రాయి వేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనను ప్రశంసిస్తూ, విపక్షాలపై విరుచుకుపడ్డారు. 

‘ప్రస్తుతం రాష్ట్రంలో మాఫియా అక్రమ నిర్మాణాలను బుల్‌డోజర్లు కూల్చివేస్తున్నాయి. ఆ మాఫియాను పెంచి పోషించిన వారు తీవ్రంగా బాధపడుతున్నారు. అందుకే ప్రజలు యూపీ+యోగి..ఎంతో ఉపయోగం(ఉపయోగి) అంటున్నారు’ అని యోగి పాలనకు ప్రధాని సరికొత్త నిర్వచనం ఇచ్చారు. 

తన అనుచరుల ఇళ్లపై జరిగిన ఐటీ దాడులను ఉద్దేశించి యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌ విమర్శలు చేయగా.. మోదీ వాటిని తిప్పికొట్టారు. ‘గతంలో ప్రజల సొమ్మును ఎలా వాడారో మీరు చూశారు. అభివృద్ధి పనులు కాగితాలకే పరిమితమయ్యేవి. వాటివల్ల వారి జేబులు నిండేవి. ఇప్పుడు ప్రజల సొమ్ము అభివృద్ధి పనులకు మాత్రమే వినియోగిస్తున్నారు’ అంటూ వెల్లడించారు. అలాగే ఇటీవల వారణాసిలో జరిపిన పర్యటనపై వస్తోన్న విమర్శలపై ఆయన స్పందించారు. దేశ సాంస్కృతిక వారసత్వ పురోగతి, అభివృద్ధి  కొన్ని రాజకీయ పార్టీలకు ఇబ్బందిగా మారిందన్నారు. వాళ్లు ఓటు బ్యాంకు విషయంలో ఆందోళనగా ఉన్నారన్నారు. సైన్యం దీటుగా స్పందించడం, మేక్ ఇన్ ఇండియా పథకాలు, కరోనా కట్టడికి తీసుకున్న చర్యలపై వీరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారని అన్నారు. ప్రభుత్వాలు ఏవైనా, అభివృద్ధిని చూసి సంతోషపడాలన్నారు. దురదృష్టం ఏంటంటే.. కొందరు అలా ఆలోచించడం లేదని విపక్ష పార్టీలను దుయ్యబట్టారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని