Ap News: ఓటీఎస్‌తో పేదలకు ఎలాంటి నష్టం ఉండదు: సజ్జల రామకృష్ణారెడ్డి

ఓటీఎస్ పథకం ద్వారా పేదలకు ఎలాంటి నష్టం ఉండదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పేదలందరూ దశాబ్దాలుగా ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇళ్లు కట్టుకొని ఉంటున్నారని.. సీఎం జగన్ చొరవతో ఇళ్ల రుణాలన్నీ మాఫీ చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తున్నామన్నారు....

Published : 07 Dec 2021 02:06 IST

అమరావతి: ఓటీఎస్ పథకం ద్వారా పేదలకు ఎలాంటి నష్టం ఉండదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పేదలందరూ దశాబ్దాలుగా ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇళ్లు కట్టుకొని ఉంటున్నారని.. సీఎం జగన్ చొరవతో ఇళ్ల రుణాలన్నీ మాఫీ చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తున్నామన్నారు. ఓటీఎస్‌పై ప్రజలు సహాయ నిరాకరణ చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు కోరారంటే దాన్ని ఏమవాలో వారే ఆలోచించుకోవాలన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వడ్డీ మాఫీ చేయాలని కోరినా చేయలేదని ఆక్షేపించారు. ఓటీఎస్‌తో భూముల క్రయవిక్రయాలు, వారసులకు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కలిగిందని సజ్జల పేర్కొన్నారు.

‘‘పదేళ్ల తర్వాత పట్టా చేసే అవకాశాన్ని ప్రభుత్వం చట్టసవరణ చేసింది. ఓటీఎస్‌తో ప్రభుత్వానికి వచ్చేది కేవలం రూ.4వేల కోట్లే. నామమాత్రపు రుసుముతో రిజిస్ట్రేషన్‌ చేసి సర్వ హక్కులు కల్పిస్తున్నాం. పంచాయతీల్లో రిజిస్ట్రేషన్లకు ఇంటికి రూ.10 వేలు, మున్సిపాల్టీలో రూ.15వేలు, కార్పొరేషన్లలో రూ. 20వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఓటీఎస్ పూర్తిగా స్వచ్ఛందం. ఎవరినీ బలవంత పెట్టడం లేదు. ఓటీఎస్‌పై విమర్శాలు చేసే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు. ఓటీఎస్‌పై దుష్ర్పచారం చేస్తే తీవ్రంగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని సజ్జల హెచ్చరించారు.

వారిపై ప్రభుత్వానికి ప్రేమే ఉంటుంది..

‘‘ఉద్యోగులు ప్రజల్లో, ప్రభుత్వంలో ఒక భాగం. ప్రభుత్వ ఆలోచనలు, విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేవారు ఉద్యోగులు. వారిపై ప్రభుత్వానికి ప్రేమే ఉంటుంది తప్ప కోపం ఉండదు. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడటం వల్ల ప్రభుత్వం ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటోంది. సీఎం హామీ మేరకు నిర్ణీత గడువులోగా పీఆర్సీ ప్రకటిస్తాం. ఉద్యోగులు ప్రజల్లో భాగమే.. వారు అనుకుంటే ఏదైనా చేయగలరు. కానీ సంయమనం పాటించాలని కోరుతున్నాం. అంగన్‌వాడీ సహా పలు వర్గాలకు ప్రభుత్వం ఇప్పటికే వేతనాలు పెంచింది. దీని ద్వారా రూ.18వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడింది’’ అని సజ్జల పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని