TS News: రేవంత్‌ రెడ్డి.. కాంగ్రెస్‌ అరువు తెచ్చుకున్న అధ్యక్షుడు: వైఎస్‌ షర్మిల

దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ సంక్షేమ పాలనను తీసుకురావడమే తన పాదయాత్ర లక్ష్యమని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన సీఎం కేసీఆర్‌.. కుటుంబ సంక్షేమంపై దృష్టి పెట్టారని విమర్శించారు. వైఎస్‌ఆర్‌ పాదయాత్ర సంక్షేమ పాలనకు....

Updated : 20 Oct 2021 19:12 IST

చేవెళ్ల: దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ సంక్షేమ పాలనను తీసుకురావడమే తన పాదయాత్ర లక్ష్యమని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన సీఎం కేసీఆర్‌.. కుటుంబ సంక్షేమంపై దృష్టి పెట్టారని విమర్శించారు. వైఎస్‌ఆర్‌ పాదయాత్ర సంక్షేమ పాలనకు పునాది వేసిందని షర్మిల చెప్పారు. చేవెళ్ల నుంచి ఆమె ఇవాళ చేపట్టనున్న ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు.

‘‘మా నాన్న వైఎస్‌ఆర్‌ చూపిన బాటలోనే నేను నడుస్తున్నా. ప్రజల సంక్షేమం పట్టని కేసీఆర్‌ను గద్దె దించడమే వైతెపా లక్ష్యం. ఏడేళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 30వేల ఉద్యోగాలు పీకేశారు. దమ్ముంటే నాతో పాదయాత్రకు రండి. రాష్ట్రంలో వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నోటిఫికేషన్లు రాక ఎంతో మంది నిరుద్యోగులు హమాలీలుగా మారారు. కళ్ల ముందు 1.90లక్షల ఉద్యోగ ఖాళీలున్నా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. రాష్ట్రంలో సమస్యలు లేవని నిరూపిస్తే ముక్కు నేలకురాసి, ఇంటికి వెళ్లిపోతాను. రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయని నేను నిరూపిస్తాను. నేను నిరూపిస్తే ఎస్సీని సీఎం చేయాలని సవాల్‌ చేస్తున్నాను.

కాంగ్రెస్‌ పార్టీ అరువు తెచ్చుకున్న అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి. రేవంత్‌రెడ్డిలా బ్లాక్‌ మెయిల్‌ చేయడం మాకు రాదు. ప్రజాప్రతినిధుల కొనుగోలు, అమ్మకాలు మాకు చేతకాదు. ఓటుకు నోటు కేసులో సీఎం కేసీఆర్‌ చేతులో రేవంత్‌ పిలకలా అయ్యారు. అడ్డంగా దొరికిన దొంగకు విశ్వసనీయత ఉంటుందా? కేసీఆర్‌ అవినీతిపై ఆధారాలు ఉన్నాయని భాజపా అంటోంది. మరి ఆ ఆధారాలను ఎందుకు బయటపెట్టడం లేదు? సీఎం కేసీఆర్‌ నాలుకకు నరం లేదు. గాడిదను కూడా ఆవు అని నమ్మించగలరు’’ అని షర్మిల అన్నారు. సభ పూర్తి అయిన తర్వాత షర్మిల తల్లి విజయమ్మ జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని