Kishan reddy: వాట్సప్‌ మెసేజ్‌ వస్తే విచారణకు పిలవడం దుర్మార్గం: కిషన్‌రెడ్డి

వాట్సప్‌లో మెసేజ్‌లు వస్తే పోలీసు విచారణకు పిలవటం దుర్మార్గమైన చర్య అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. 

Published : 06 Apr 2023 20:49 IST

పోలీసులను వాడుకోవడం కల్వకుంట్ల కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పోలీసు వ్యవస్థను ఇంతగా దుర్వినియోగం చేసిన రాష్ట్రం మరొకటి లేదన్నారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ పేరుతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. వాట్సాప్‌లో మెసేజ్‌లు వస్తే పోలీసు విచారణకు పిలవటం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. వాట్సాప్‌ మెసేజ్‌ వచ్చిందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు నోటీసులు పంపడం దారుణమన్నారు. ప్రతిపక్ష నేతలు అంటే బానిసలు అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. 

‘‘జర్నలిస్టు ప్రశాంత్‌ ఎంతో మందికి ప్రశ్నపత్రం మెసేజ్‌లు ఫార్వర్డ్‌ చేశారు. మీడియా ప్రతినిధులకు కూడా నోటీసులు ఇస్తామని పోలీసులు బెదిరిస్తున్నారు. వారికి వ్యతిరేకంగా ఉన్న మీడియాపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. జర్నలిస్టులు తమకు వచ్చిన సమాచారాన్ని వేగంగా సమాజానికి తెలియజేసేందుకు ప్రయత్నిస్తారు. అందులో వాట్సాప్‌ మెసేజ్‌లు పంపడం సాధారణం. జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. జర్నలిస్టులు ఎవరూ భయపడొద్దు. అన్ని విధాలుగా భాజపా అండగా ఉంటుంది’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని