Kishan reddy: కేసీఆర్‌కు స్టీల్‌ ప్లాంట్‌ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా?: కిషన్‌రెడ్డి

సీఎం కేసీఆర్‌కు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? స్టీల్‌ ప్లాంట్‌ పేరుతో గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు.   

Updated : 20 Apr 2023 11:03 IST

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ తెలంగాణలో పాలనను గాలికి వదిలేసి భారాస పేరుతో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.  భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కొంటామని సింగరేణి అధికారులను ఆగమేఘాల మీద సీఎం కేసీఆర్‌ వైజాగ్‌ పంపించారు.   మంత్రులు కూడా స్టీల్ ప్లాంట్‌ అంశంపై అనేక ప్రకటనలు చేశారు. సింగరేణిలో పనిచేసే కార్మికులు అసంతృప్తితో ఉన్నారు.  ప్రధాని అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వస్తే భారాస నిరసనలు చేపట్టింది. సింగరేణిని కేంద్రం ప్రైవేటు పరం చేస్తుందంటూ  నిరసనలు చేపట్టారు. తెలంగాణలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. ఒక్క పరిశ్రమనైనా తెరిపించారా? కేసీఆర్‌ చెప్పాలి. వందరోజుల్లో నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చారు. తొమ్మిదేళ్లు అవుతున్నా నిజాం షుగర్స్‌కు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.

సీఎం కేసీఆర్‌కు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? స్టీల్‌ ప్లాంట్‌ పేరుతో గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారు.  ఇంది ఎంత వరకు సమంజసమో కల్వకుంట్ల కుటుంబం చెప్పాలి.  కేసీఆర్‌ వైఫల్యాల నుంచి తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టించేందుకు కల్వకుంట్ల కుటుంబం ఎత్తుగడలు వేస్తోంది. తొమ్మిదేళ్ల తర్వాత కేసీఆర్‌ నిద్ర మేల్కొని అంబేడ్కర్‌ జయంతి రోజున నివాళులర్పించారు.  రాజకీయ ఎత్తుగడే తప్ప కేసీఆర్‌కు అంబేడ్కర్‌పై గౌరవం లేదు.

భద్రాచలం సీతారాముల కల్యాణం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించే సంప్రదాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తిలోదకాలిచ్చారు. దళిత బంధు కాస్త భారాస బంధు అయ్యింది. ముఖ్యమంత్రికి ఇఫ్తార్‌ విందుకు వెళ్లడానికి సమయం ఉంటుంది కానీ.. భద్రాచలానికి మాత్రం రారు. అవినీతిపై ఆరోపణలు వస్తే దర్యాప్తు జరపవద్దని రాజ్యాంగంలో రాసి ఉందా? చట్టం తనపని చేసుకుంటూ పోతుంది... ఎవరి జోక్యం ఉండదు.ముఖ్యమంత్రికి రాసే లేఖలు సమాజం కోసం రాస్తున్నా.. కేసీఆర్‌ స్పందిస్తారని కాదు’’ అని కిషన్‌ రెడ్డి తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని