Gujarat Election 2022: రండి.. ఓట్లేయండి.. గుజరాత్‌ ప్రజలకు ఈసీ విజ్ఞప్తి

గుజరాత్‌ తొలివిడత పోలింగ్‌లో నిరాశాజనకమైన ఓటింగ్‌ శాతం నమోదైన నేపథ్యంలో ఓటర్లకు ఎన్నికల సంఘం ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. రెండో విడత పోలింగ్‌లో ‘పట్టణ ఉదాసీనతకు’ చోటివ్వకుండా ప్రతిఒక్కరూ తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరింది.

Published : 04 Dec 2022 01:01 IST

దిల్లీ: గుజరాత్‌ తొలివిడత పోలింగ్‌ (Gujarat Election 2022)లో నిరాశాజనకమైన ఓటింగ్‌ శాతం నమోదైన నేపథ్యంలో ఓటర్లకు ఎన్నికల సంఘం( Election Commission) ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. సోమవారం జరగనున్న పోలింగ్‌ ప్రక్రియలో ‘పట్టణ ఉదాసీనతకు’ చోటివ్వకుండా ప్రతిఒక్కరూ తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరింది. డిసెంబరు 1న జరిగిన తొలివిడత ఎన్నికల్లో 63.3 శాతం ఓటింగ్‌ నమోదైంది. సూరత్‌, రాజ్‌కోట్‌, జామ్‌నగర్‌ పట్టణాల్లో సరాసరి కంటే ఇంకా తక్కువ పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. మరోవైపు 2017 అసెంబ్లీ ఎన్నికల తొలివిడతలో పోలైన 66.75 శాతం ఓటింగ్‌ శాతం కన్నా ఈసారి ఇంకా తగ్గిందని ఈసీ వెల్లడించింది.

అయితే, తొలివిడత పోలింగ్‌లో కొన్ని నియోజకవర్గాల్లో గతంతో పోల్చుకుంటే ఓటింగ్‌ శాతం పెరిగినప్పటికీ.. పట్టణ ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య బాగా తగ్గిందని దాని ప్రభావం సరాసరి పోలింగ్‌ శాతంపై పడిందని అధికారులు చెబుతున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. రాష్ట్రంలో సరాసరి ఓటింగ్‌ 75.6 శాతం కాగా.. సిమ్లాలో మాత్రం అత్యల్పంగా 62.53 శాతం ఓటింగ్‌ నమోదైంది. దీనిని బట్టి పట్టణ ప్రాంతాల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపడం లేదని స్పష్టమవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రాంత ప్రజలకు ఎన్నికల సంఘం ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరింది.

ప్రచారాలు బంద్‌.. బరిలో 833 మంది అభ్యర్థులు

గుజరాత్‌లో రెండో విడత ఎన్నికల ప్రచార సమయం ముగిసింది. రెండో విడతగా.. రాష్ట్రంలోని 14 జిల్లాల వ్యాప్తంగా 93 నియోజవర్గాల పరిధిలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 833 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.2.54 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. రెండో విడత పోలింగ్‌ కోసం అధికారులు 26,409 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.  యితే తొలి విడతతో పోల్చుకుంటే ఈసారి పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. ఘట్లోడియా నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ పోటీ చేస్తున్నారు. వీరమ్‌గమ్‌ నుంచి పాటిదార్‌ నాయకుడు హార్దిక్‌ పటేల్‌ బరిలో నిలిచారు. గాంధీనగర్‌ సౌత్‌ స్థానం నుంచి ఓబీసీ నాయకుడు అల్పేశ్‌ ఠాకూర్‌ అదృష్టం పరీక్షించుకోనున్నారు.

రెండో విడత ఎన్నికల్లో భాజపాకు రెబల్‌ అభ్యర్థుల  బెడద ఎక్కువగా కనిపిస్తోంది. పార్టీ టికెట్‌ కేటాయించకపోవడంతో చాలా మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. వఘోడియా ఎమ్మెల్యే మధు శ్రీవాత్సవ్‌ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతున్నారు. ఈ స్థానంపై ఆయనకు మంచి పట్టుంది. మరోవైపు దిను సోలంకి, ధవల్‌ సిన్హ్‌ జాలా, హర్షద్‌ వాత్సవ కూడా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. రెండో దశలోనూ భాజపా వినూత్న ప్రచార వ్యూహంతో దూసుకెళ్లింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్‌పైనే భారీ ఆశలు పెట్టుకున్న కమలదళం.. ఆయనతో చరిత్రలోనే నిలిచిపోయేలా మెగా రోడ్‌షో చేపట్టింది. 16 నియోజకవర్గాలను కవర్‌ చేసేలా ఏకంగా 50 కి.మీల మేర ఈ రోడ్‌ షో నిర్వహించింది. దీంతోపాటు గత రెండు రోజుల్లో ప్రధాని మోదీ.. అహ్మదాబాద్‌, ఆణంద్‌, పంచమహల్‌ తదితర జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని