PM Modi: పసుపు రైతుల కోసం.. ఎంతవరకైనా వెళ్తాం: ప్రధాని మోదీ

PM Modi: పసుపు బోర్డు ఏర్పాటు నిర్ణయంపై నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. దీనికి స్పందించిన ప్రధాని.. పసుపు రైతుల కోసం తాము ఎంతవరకైనా వెళ్తామని హామీ ఇచ్చారు.

Updated : 02 Oct 2023 12:12 IST

హైదరాబాద్‌: పసుపు రైతుల ఉజ్వల భవిష్యత్తు కోసం తమ ప్రభుత్వం ఎంతవరకైనా వెళ్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) అన్నారు. తెలంగాణ (Telangana)లోని మహబూబ్‌నగర్‌లో ఆదివారం జరిగిన ‘పాలమూరు ప్రజాగర్జన’ బహిరంగ సభలో పసుపు బోర్డుపై ఆయన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. నిజామాబాద్‌ (Nizamabad)లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

దీనిపై నిజమాబాద్‌ ఎంపీ అర్వింద్‌ (Arvind) సోషల్‌మీడియా వేదికగా స్పందిస్తూ ప్రధాని మోదీ (PM Modi), కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అర్వింద్‌ పోస్ట్‌కు స్పందించిన ప్రధాని మోదీ.. ‘‘రైతుల శ్రేయస్సు, సౌభాగ్యాలే ఎల్లప్పుడూ మా మొదటి ప్రాధాన్యత. జాతీయ పసుపు బోర్డు (National Turmeric Board)ను ఏర్పాటు చేయడం ద్వారా.. మన పసుపు రైతుల సామర్థ్యాన్ని సరిగ్గా వినియోగించుకోవడం, వారికి తగిన మద్దతును అందించడమే మా లక్ష్యం. ముఖ్యంగా దీని ఏర్పాటుతో నిజామాబాద్‌కు అందే ప్రయోజనాలు అపారం. మన పసుపు రైతులకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు మేం ఎంతవరకైనా వెళ్తాం.. ఏమైనా చేస్తాం..’’ అని మోదీ తెలుగులో పోస్ట్‌ చేశారు.

తెలంగాణలో పసుపు బోర్డు.. గిరిజన వర్సిటీ: ప్రధాని మోదీ ప్రకటన

అంతకుముందు పాలమూరు సభకు సంబంధించిన తన ప్రసంగం వీడియోలను కూడా మోదీ పంచుకున్నారు. ‘‘భారాస, కాంగ్రెస్‌ రెండూ వంశపారంపర్య పార్టీలు. అవి అవినీతిని, లంచగొండితనాన్ని పెంచి పోషించేందుకు మాత్రమే కృషి చేస్తున్నాయి’’ అని ప్రధాని దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని