తెలంగాణలో పసుపు బోర్డు.. గిరిజన వర్సిటీ

తెలంగాణలో మార్పు భాజపాతోనే సాధ్యమని.. తమ పార్టీకి రాష్ట్రంలో రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు.

Updated : 02 Oct 2023 07:38 IST

ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటన
అవినీతే భారాస, కాంగ్రెస్‌ల సిద్ధాంతం
తెలంగాణలో కుటుంబస్వామ్యం
పాలమూరు ప్రజాగర్జనలో ప్రధానమంత్రి ధ్వజం
ప్రజలు కోరుకుంటున్న మార్పు  భాజపాతోనే సాధ్యమని వెల్లడి
రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు  ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు


పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు

రాష్ట్రంలో ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారని ప్రజల కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అవినీతిరహిత, పారదర్శక, జవాబుదారీ పాలనను, తప్పుడు వాగ్దానాలిచ్చేది కాకుండా పనిచేసే ప్రభుత్వం కావాలను కుంటున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత వారు కోరుకుంటున్న అవినీతి రహిత పాలన ఏర్పడుతుంది. మార్పు భాజపాతోనే సాధ్యం. రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు మద్దతు ఇవ్వాలి.

ప్రధాని మోదీ


ఈనాడు, మహబూబ్‌నగర్‌: తెలంగాణలో మార్పు భాజపాతోనే సాధ్యమని.. తమ పార్టీకి రాష్ట్రంలో రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డును, ములుగులో సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. మహబూబ్‌నగర్‌ సమీపంలోని అమిస్తాపూర్‌ వద్ద ఆదివారం భాజపా ఏర్పాటు చేసిన ‘పాలమూరు ప్రజాగర్జన’ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. రానున్న ఎన్నికల్లో భాజపాను గెలిపించి.. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిద్దామని పిలుపునిచ్చారు. భారాస, కాంగ్రెస్‌ పార్టీలకు అవినీతి, కమీషన్లే సిద్ధాంతమని ఆయన విమర్శించారు. కుటుంబాల కోసమే ఆ పార్టీలు పనిచేస్తాయని.. వాటి నుంచి అంతకంటే ఎక్కువ ఆశించలేమని అన్నారు. సామాన్య ప్రజలనే భాజపా కుటుంబంగా భావించి పాలన అందిస్తోందని చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కుటుంబస్వామ్యం చేశారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీగా మార్చారని.. ఆ కంపెనీలో ఛైర్మన్‌, సీఈవో నుంచి మేనేజర్‌ వరకు అంతా కుటుంబ సభ్యులేనని ఎద్దేవా చేశారు. సహాయ సిబ్బందిగా మాత్రం ఇతరుల్ని నియమించుకున్నారన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో పెద్దఎత్తున దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. రూ.వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు చెబుతున్నా నీరు మాత్రం అందడం లేదన్నారు.

రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో భారాస(అప్పటి తెరాస) ప్రకటించి.. మాఫీ చేయకపోవడంతో ఎంతోమంది రైతులు నష్టపోయారన్నారు. భారాస ప్రభుత్వం స్టీరింగ్‌ మజ్లిస్‌ చేతిలో ఉందని విమర్శించారు. సభలో పాల్గొనే ముందు ప్రధాని రూ.13,500 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అధికారిక కార్యక్రమాల్లో గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌, అధికారులు పాల్గొన్నారు. భాజపా సభలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, ఎంపీ అర్వింద్‌, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌, పార్టీ నేతలు జితేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి, గరికపాటి మోహన్‌రావు, మురళీధర్‌రావు, ఇంద్రసేనారెడ్డి, రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగం ఆయన మాటల్లోనే..

తెలంగాణ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు..

‘‘తెలంగాణ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టాం. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో ఎరువుల కొరత ఏర్పడకుండా రూ.6,300 కోట్లు వెచ్చించి.. రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభించాం. రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం. పంటలకు కనీస మద్దతు ధర కింద 2014కి ముందు ప్రభుత్వాలు ఏటా రూ.3,400 కోట్లు వెచ్చించేవి. కేంద్రంలో భాజపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఏడాదిలోనే రూ.27 వేల కోట్లు వ్యయం చేస్తోంది. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. రాష్ట్రంలో 2014కు ముందు 2,500 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులుంటే.. ఈ తొమ్మిదేళ్లలో మరో 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులొచ్చాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు సహా ఇతరుల్లోని కళా నైపుణ్యాలను కాపాడేందుకే ప్రధాని విశ్వకర్మ పథకం తీసుకొచ్చాం. రైౖతులు, యువత సహా అన్ని వర్గాల ప్రజల మెరుగైన జీవనానికి ప్రయోజనం కలుగుతుంది. దేశ ప్రజలు స్వచ్ఛతలో పెద్దఎత్తున భాగస్వాములై సామాజిక ఉద్యమంగా మార్చాలి.

దిల్లీలో ఓ సోదరుడున్నాడని గుర్తుంచుకోండి

తెలంగాణలోని చెల్లెమ్మలకు దిల్లీలో ఒక సోదరుడున్నాడని గుర్తుంచుకోవాలి. మహిళల కోసం భాజపా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. వారి ఆత్మగౌరవం కాపాడేందుకు మరుగుదొడ్ల నిర్మాణం, ముద్రా యోజన ద్వారా ఆర్థిక తోడ్పాటు, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ద్వారా ఇళ్లు, ఉచిత గ్యాస్‌ కనెక్షన్లతో అండగా నిలుస్తోంది. రాణి రుద్రమదేవి వంటి ధీరవనితలు పుట్టిన తెలంగాణ గడ్డ నుంచి మహిళల గొంతు మరింత బలంగా చట్టసభల్లో వినిపించనుంది. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదంతో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు దక్కుతాయి. పార్లమెంటులో బిల్లును ఆమోదించుకుని నవరాత్రులు రాకముందే శక్తిపూజ స్ఫూర్తి నెలకొల్పాం.

రూ.900 కోట్లతో గిరిజన విశ్వవిద్యాలయం

దేశంలో పసుపు పండించడంతోపాటు వినియోగం ఎక్కువ. తెలంగాణ రైతులు సైతం భారీఎత్తున ఉత్పత్తి చేస్తున్నారు. కొవిడ్‌ అనంతరం పసుపు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో పంట ఉత్పత్తి నుంచి దిగుబడి వరకు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ పసుపు రైతులకు శుభాకాంక్షలు. ములుగు కేంద్రంగా కేంద్రం ఆధ్వర్యంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నాం. గిరిజనుల ఆరాధ్య దేవతలు సమ్మక్క-సారక్క పేరుతో ఈ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. దీనికి రూ.900 కోట్లు వెచ్చించనున్నాం.

రహదారుల అనుసంధానంతో ప్రయోజనం..

జాతీయ రహదారులను అనుసంధానం చేయడంతో ఈ ప్రాంతవాసులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. నాగ్‌పుర్‌-విజయవాడ కారిడార్‌ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. ఈ మూడు రాష్ట్రాల్లో వాణిజ్యం, పర్యాటకం, పారిశ్రామిక రంగాలకు చేయూత లభిస్తుంది. ఈ కారిడార్లు వాణిజ్య హబ్‌లుగా మారనున్నాయి. అయిదు మెగా ఫుడ్‌ పార్కులు, నాలుగు ఫిషింగ్‌ సీ ఫుడ్‌ క్లస్టర్‌, మూడు ఫార్మా, మెడికల్‌ క్లస్టర్‌, ఒకటి మెగా టైక్స్‌టైల్‌ క్లస్టర్‌ అభివృద్ధి చెందుతున్నాయి. హనుమకొండ, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో నిరుద్యోగ యువతకు ఎన్నో ఉపాధి అవకాశాలు రానున్నాయి. దేశంలో 2014 వరకు సుమారు 14 కోట్ల ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్లు ఉండేవి. 2023లో అవి 32 కోట్లకు చేరుకున్నాయి. ఇటీవల సిలిండర్‌ ధరను తగ్గించాం. గ్యాస్‌ ఉత్పత్తిని పెంచడంతోపాటు సరఫరా అనుసంధానాలను పెంచుతున్నాం. హసన్‌-చర్లపల్లి ఎల్‌పీజీ పైపులైను ఈ ప్రాంత ప్రజల గ్యాస్‌ అవసరాలను తీరుస్తుంది. కృష్ణపట్నం-హైదరాబాద్‌ మధ్య ఎల్‌పీజీ గ్యాస్‌కు సంబంధించిన మల్టీపర్పస్‌ పైపులైనుకు శిలాఫలకం ఆవిష్కరించాం. తద్వారా తెలంగాణలో చాలామందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.’’

తెలుగులో ప్రసంగం ఆరంభించి..

పాలమూరు ప్రజలందరికీ నా నమస్కారాలు అంటూ ప్రధాని తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. పలుమార్లు నా కుటుంబ సభ్యుల్లారా? అని తెలుగులో మాట్లాడారు. ‘మీరు చూపిన ప్రేమకు ముగ్ధుడినయ్యాను. నాపై తెలంగాణ ప్రజలు ఎంతో ప్రేమ, అభిమానాన్ని చాటారు’ అని అన్నారు.

ప్రధాని మోదీ జాతికి అంకితం  చేసిన  ప్రాజెక్టులు

  • సూర్యాపేట-ఖమ్మం నాలుగు వరుసల రహదారి
  • జక్లేర్‌-కృష్ణా కొత్త రైల్వే లైను
  • హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన కొత్త భవనాలు
  • హెచ్‌పీసీఎల్‌-హసన్‌-చర్లపల్లి ఎల్‌పీజీ పైపులైను
  • హైదరాబాద్‌(కాచిగూడ)-రాయచూరు రైలు

శిలాఫలకాలను ఆవిష్కరించిన ప్రాజెక్టులు

  • వరంగల్‌-ఖమ్మం 4 వరుసల జాతీయ రహదారి
  • ఖమ్మం-విజయవాడ 4 వరుసల జాతీయ రహదారి
  • కృష్ణపట్నం నుంచి హైదరాబాద్‌ వరకు బహుళ ఉత్పత్తుల పైపులైను పనులు

ప్రధాని మోదీకి ఘన స్వాగతం,వీడ్కోలు

ఈనాడు, హైదరాబాద్‌, శంషాబాద్‌, న్యూస్‌టుడే: మహబూబ్‌నగర్‌ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకున్నారు. ప్రధానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హరీశ్‌, సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తదితరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం హెలికాప్టర్‌లో ప్రధాని మహబూబ్‌నగర్‌కు వెళ్లారు. వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన, బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మహబూబ్‌నగర్‌ పర్యటన ముగించుకొని తిరిగి సాయంత్రం 5.30 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. దిల్లీకి పయనమైన మోదీకి ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, మహిళా మోర్చా నేతలు, అధికారికంగా మంత్రి తలసాని, సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌ తదితరులు సాదర వీడ్కోలు పలికారు. సాయంత్రం 5.55 గంటలకు ప్రత్యేక విమానంలో ప్రధాని దిల్లీకి పయనమయ్యారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని