బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించా: కిరణ్‌బేదీ

రాజ్యాంగ పరమైన పదవిలో తన విధుల్ని నైతిక విలువలతో, బాధ్యతాయుతంగా నిర్వర్తించానని పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేదీ పేర్కొన్నారు.

Published : 17 Feb 2021 12:43 IST

పుదుచ్చేరి: రాజ్యాంగ పరమైన పదవిలో తన విధుల్ని నైతిక విలువలతో, బాధ్యతాయుతంగా నిర్వర్తించానని పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేదీ అన్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కిరణ్‌బేదీని తొలగిస్తూ కేంద్రం మంగళవారం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆమె బుధవారం తన వీడ్కోలు లేఖను ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు.

‘రాజ్యాంగబద్ధమైన పదవిలో నా విధుల్ని.. విలువలతో బాధ్యతాయుతంగా నిర్వర్తించాను. పుదుచ్చేరికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అవకాశం కల్పించి నాకు జీవిత అనుభవాల్ని అందించేలా చేసిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ క్రమంలో నాతో కలిసి పనిచేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజా ప్రయోజనాల కోసం రాజ్‌భవన్‌ సిబ్బంది ఉన్నతంగా కృషి చేశారు. పుదుచ్చేరి భవిష్యత్తులోనూ అభివృద్ధి పథంలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’ అని కిరణ్‌బేదీ లేఖలో పేర్కొన్నారు.

పుదుచ్చేరిలో నెలరోజుల వ్యవధిలో అధికార కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో అక్కడి ప్రభుత్వం సంక్షోభంలో పడిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగాయి. ఈ క్రమంలో పుదుచ్చేరికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న కిరణ్‌బేదీని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తొలగించారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఈ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. కాగా కిరణ్‌బేదీకి, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామికి మధ్య తొలి నుంచే ఉద్రిక్త వాతావరణం ఉన్న విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని