Eknath Shinde: ‘మహా’ రాజకీయ సంక్షోభం.. ఎవరీ ఏక్‌నాథ్‌ షిండే..?

మహారాష్ట్ర మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వంలో ఊహించని కుదుపు.. నిన్న మొన్నటి వరకు అటు పార్టీ, ఇటు ప్రభుత్వ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న రాష్ట్ర మంత్రి, శివసేన కీలక నేత ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటు.

Published : 21 Jun 2022 16:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహారాష్ట్ర మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వంలో ఊహించని కుదుపు.. నిన్న మొన్నటి వరకు అటు పార్టీ, ఇటు ప్రభుత్వ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న రాష్ట్ర మంత్రి, శివసేన కీలక నేత ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటు.. తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి గుజరాత్‌కు పయనం.. ఈ పరిణామాలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సంకీర్ణ ప్రభుత్వం భవిష్యత్తును గందరగోళంలో పడేశాయి. ఇంతకీ.. ఎవరీ ఏక్‌నాథ్‌ షిండే ?

వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి..

మరాఠా వర్గానికి చెందిన ఏక్‌నాథ్‌ షిండే స్వస్థలం సతారా. అనంతరం వీరి కుటుంబం ఠాణేలో స్థిరపడింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిన్న తనంలోనే చదువుకు దూరమైన ఆయన.. కుటుంబానికి అండగా ఉండేందుకు చిన్న చిన్న పనులు చేసేవారు. రిక్షా, టెంపో డ్రైవర్‌గా కూడా పనిచేశారు. 1980ల్లో శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్‌ ఠాక్రే స్ఫూర్తితో రాజకీయాల్లో చేరిన ఆయన క్రమక్రమంగా పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ఠాణే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. రాణే జిల్లాలో జరిగిన ప్రజా ఉద్యమాల్లో ముందుండేవారు. అలా శివసేన అధిష్ఠానం దృష్టిలో పడిన షిండే.. 2004లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా నాలుగు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల తర్వాత శాసనసభలో శివసేన పక్షనేత బాధ్యతలు అందుకున్నారు. 2019లోనూ వరుసగా రెండోసారి శివసేన శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. ఠాణే ప్రాంతంలో శివసేనను బలోపేతం చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. షిండే కుమారుడు శ్రీకాంత్‌ షిండే లోక్‌సభ ఎంపీగా వ్యవహరిస్తున్నారు. ఆయన సోదరుడు ప్రకాశ్‌ షిండే కౌన్సిలర్‌గా ఉన్నారు.

సీఎం ఆశలు గల్లంతై..

2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహారాష్ట్ర రాజకీయాల్లో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భాజపాకు గుడ్‌బై చెప్పిన శివసేన.. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి మహా వికాస్‌ అఘాడీ కూటమిగా ఏర్పడింది. ఈ కూటమి వెనుక షిండే కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగకుండా మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కాపాడటం కోసం నిరంతరం శ్రమించారు. మూడు పార్టీల ఎమ్మెల్యేలను సొంత ఖర్చులతో రిసార్ట్‌లకు తరలించారు. ఇక సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత శివ సైనికుడినే సీఎంను చేయాలని అంతా భావించారు. అయితే అప్పటికి ఉద్ధవ్‌ ఠాక్రే రాష్ట్ర పగ్గాలు చేపట్టేందుకు సుముఖంగా లేకపోవడంతో సీఎం రేసులో ఏక్‌నాథ్‌ షిండే పేరు ప్రధానంగా వినిపించింది. కానీ, ఇందుకు ఎన్సీపీ అభ్యంతరం చెప్పడంతో చివరకు ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నారు. అలా షిండే సీఎం ఆశలు గల్లంతయ్యాయి.

ఠాక్రేల జోక్యాన్ని భరించలేక..

సీఎం పదవి దక్కనప్పటికీ.. ఆ బాధను దిగమింగుకుని పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు షిండే. ప్రస్తుతం ఠాక్రే సర్కారులో పట్టణాభివృద్ధి, ప్రజా పనుల శాఖల మంత్రిగా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా పార్టీలో ఉద్ధవ్‌ ఠాక్రే, సంజయ్‌ రౌత్‌ తీరుతో షిండే అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ వ్యవహారాల్లో తనను పక్కనబెట్టి ఆదిత్య ఠాక్రేకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై షిండే అసహనానికి గురైనట్లు సమాచారం. ఇక, తన మంత్రిత్వ శాఖ వ్యవహారాల్లో ఆదిత్య ఠాక్రే అనవసర జోక్యం చేసుకోవడం షిండేకు నచ్చలేదు. మరోవైపు, తన శాఖలకు సంబంధించిన వ్యవహారాల్లో షిండేకు స్వేచ్ఛను ఇవ్వలేదని, ప్రతి నిర్ణయానికి సీఎంఓ అనుమతి తప్పనిసరి చేయడంతో షిండే అసంతృప్తికి గురైనట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. దీనికి తోడు, ఇటీవల జరిగిన రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలను షిండేకు కాకుండా సంజయ్‌రౌత్‌కు అప్పగించడం ఆయనకు మరింత అసహనానికి గురిచేసినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితమే షిండే.. సీఎం ఠాక్రే, ఇతర నేతలతో కలిసి శివసేన వార్షికోత్సవంలో పాల్గొన్నారు. అంతకుముందు ఆదిత్యఠాక్రేతో కలిసి అయోధ్య పర్యటనకూ వెళ్లారు.

ఫడణవీస్‌తో సాన్నిహిత్యం..

భాజపా నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో షిండేకు మంచి స్నేహం ఉంది. 2014లో ఫడణవీస్‌ ప్రభుత్వంలో షిండే కేబినెట్‌ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఫడణవీస్‌కు షిండే టచ్‌లో ఉన్నారని సమాచారం. మరోవైపు, రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో భాజపా హైకమాండ్‌ను కలిసేందుకు ఫడణవీస్‌ నేడు దిల్లీ వెళ్లారు. ఈ నేపథ్యంలో షిండే భాజపాలో చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని