రైతులతో ప్రధాని ఎందుకు మాట్లాడటం లేదు

కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న రైతుల్ని ప్రధాని మోదీ గానీ.. కేంద్ర మంత్రులు గానీ ఎందుకు కలవడం లేదని శిరోమణి అకాలీదళ్‌ చీఫ్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ మీడియాతో మాట్లాడారు.

Published : 02 Feb 2021 01:25 IST

శిరోమణి అకాలీదళ్‌ చీఫ్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ 

దిల్లీ: కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న రైతుల్ని ప్రధాని మోదీ గానీ.. కేంద్ర మంత్రులు గానీ ఎందుకు కలవడం లేదని శిరోమణి అకాలీదళ్‌ చీఫ్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ మీడియాతో మాట్లాడారు. ‘రైతులు తమ ప్రాణాలను పణంగా పెట్టి వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఎంతో మంది రైతులు తమ ప్రాణాలు కోల్పోయినా కూడా కేంద్రం పట్టించుకోవడం లేదు. వారికి న్యాయం కూడా చేయడం లేదు. రైతులు ఇంతటి శీతల వాతావరణంలో ఆందోళనలు చేస్తుంటే ప్రధానమంత్రి వారిని కలిసేందుకు ఎందుకు రావడం లేదు’ అని బాదల్‌ ప్రశ్నించారు.

కేంద్రం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ గురించి మాట్లాడుతూ..‘కేంద్రం ఈ రోజు డిజిటల్‌ బడ్జెట్‌ని లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అది డిజిటల్‌ లేదా పేపర్‌..  ఏ బడ్జెట్‌ అయినా కావచ్చు. కానీ సాధారణ ప్రజలకు ప్రయోజనం లేని బడ్జెట్‌ ఎలా ఉంటే ఏంటి? ’ అని బాదల్‌ ప్రశ్నించారు. కేంద్ర సాగు చట్టాలకు మద్దతుగా వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌కు వచ్చిన లేఖల గురించి ప్రస్తావించగా..‘మన దేశంలో చాలా బలమైన మీడియా నెట్‌వర్క్‌ ఉంది. ఎవరైనా నిజంగా వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలిపినట్లు ఏ ఛానల్‌ అయినా ప్రచురించిందా? అని బాదల్‌ ప్రశ్నించారు. ‘ఇది కేవలం రైతుల పోరాటమే కాదు.. దేశవ్యాప్త ప్రజల పోరాటం. పార్లమెంటులో రైతుల అంశాన్ని లేవనెత్తాలని ఈ దేశ రైతులు కోరుతున్నారు.  అన్ని పార్టీలు ఈ విషయంలో తమ గొంతుకను వినిపించాలి’ అని బాదల్‌ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి

నాపై అసత్య ప్రచారం మానుకోవాలి: ఆమని

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని