Siddaramaiah: మౌన ప్రేక్షకుల్లా మేం చూస్తూ ఊరుకోం: సిద్ధరామయ్య

అవినీతి కేసులొస్తే.. మౌనప్రేక్షకుల్లా చూస్తూ ఉండబోమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఆదివారం ఆయన గదగ్‌లో విలేకర్లతో మాట్లాడారు.

Updated : 17 Dec 2023 19:40 IST

గదగ్‌: తమ ప్రభుత్వం అవినీతిని ఉపేక్షించదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య (Siddaramaiah) అన్నారు. అవినీతికి సంబంధించిన కేసులు గుర్తిస్తే..  వాటిపై మౌన ప్రేక్షకుల్లా చూస్తూ ఉండబోమని.. తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వ ‘40 శాతం కమీషను’పై దర్యాప్తు కొనసాగుతోందని.. దోషులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్లను విధుల్లో నియమించేందుకు కొందరు అధికారులు లంచాలు డిమాండ్‌ చేస్తుండటంపై విలేకర్లు ప్రశ్నించగా.. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతామని సీఎం సిద్ధరామయ్య చెప్పారు.

నివేదిక రాకుండానే విమర్శలా?

రాష్ట్రంలో చేపట్టిన కులగణన అశాస్త్రీయమంటూ కొందరు చేస్తున్న ఆరోపణలపై విలేకర్లు ప్రశ్నించగా..  అసలు బీసీ కమిషన్‌ ఇంకా నివేదిక సమర్పించలేదన్నారు. అంతకముందే కొందరు ఇది అశాస్త్రీయమంటూ కామెంట్లు చేస్తున్నారని విచారం వ్యక్తంచేశారు. నివేదికలో ఏముందో తెలియకుండా అలాంటి ప్రకటనలు చేస్తున్నారన్నారు. ముందు నివేదిక రానివ్వండి.. అని సిద్ధరామయ్య సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ఐదు గ్యారెంటీలను ‘వైఫల్యాలు’గా భాజపా పేర్కొనడంపై సిద్ధరామయ్య తనదైన శైలిలో స్పందించారు. ఆరెస్సెస్‌, దాని అనుబంధ సంస్థలను అబద్ధాల ఫ్యాక్టరీలుగా అభివర్ణించారు. భాజపా, సంఘ్‌ పరివార్‌ ఒక అబద్ధాల కర్మాగారమంటూ మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని