Rajasthan Crisis: పార్టీ హైకమాండ్‌ని ఎప్పుడూ ఛాలెంజ్‌ చేయను.. సోనియాకు గహ్లోత్‌ ఫోన్‌!

రాజస్థాన్‌(Rajasthan)లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన హైడ్రామా తర్వాత తొలిసారి సీఎం అశోక్‌ గహ్లోత్‌(Ashok Gehlot) కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)తో......

Published : 28 Sep 2022 01:24 IST

జైపూర్‌: రాజస్థాన్‌(Rajasthan)లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన హైడ్రామా తర్వాత తొలిసారి సీఎం అశోక్‌ గహ్లోత్‌(Ashok Gehlot) కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)తో మాట్లాడారు. ఈ మేరకు ఆమెకు ఫోన్‌ చేశారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ను తాను ఎప్పుడూ ఛాలెంజ్‌ చేయనని ఈ సందర్భంగా గహ్లోత్‌ ఆమెతో చెప్పినట్టు సమాచారం. గహ్లోత్‌ వర్గం ఎమ్మెల్యేల తీరుతో కాంగ్రెస్‌లో సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్ష పదవి బరిలో ఆయన నిలుస్తారా? లేదా అనే విషయంలో ఇంకా సస్పెన్స్‌ వీడలేదు. పార్టీని ధిక్కరించేలా వ్యవహరించిన గహ్లోత్‌ను అధ్యక్ష పదవికి పోటీ నుంచి తప్పించాలంటూ సీడబ్ల్యూసీ సభ్యుల నుంచి డిమాండ్లు కూడా వస్తున్నాయి. అయితే, ఇందుకు పార్టీ అధిష్ఠానం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. మరోవైపు, కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల విషయంలో తుది నిర్ణయం తీసుకొనే ముందు సోనియా గాంధీ కాంగ్రెస్‌ సీనియర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం సీనియర్‌ నేత ఏకే ఆంటోనీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. 

నేను రేసులో లేను: ఆంటోనీ

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో తాను లేనని ఆ పార్టీ సీనియర్‌ నేత ఏకే ఆంటోనీ స్పష్టంచేశారు. అనారోగ్య కారణాల రీత్యా రెండేళ్ల క్రితమే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు చెప్పారు. మరోవైపు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో నేడు సీఎం గహ్లోత్‌ ఎలాంటి సమావేశం నిర్వహించలేదని ఆయన కార్యాలయం స్పష్టంచేసింది. ఆయన రోజువారీ విధుల్లోనే ఉన్నట్టు పేర్కొంది.

సోనియా అమ్మలాంటివారు..: ఎమ్మెల్యే

ఇదిలా ఉండగా.. ఎమెల్యేలు ఒకరితర్వాత ఒకరితో హైకమాండ్‌ పంపించిన పరిశీలకులతో చర్చలకు సిద్ధంగానే ఉన్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రతాప్‌సింగ్‌ కచారియావాస్‌ అన్నారు. ఇది ప్రజాస్వామ్యమని.. పార్టీ పంపిన పరిశీలకులతో భేటీ కావడానికి నిరాకరిస్తామని భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలందరికీ సోనియా గాంధీ తల్లిలాంటి వారన్నారు. ఆమె ప్రధాని పదవిని తిరస్కరించి గొప్ప ఆర్థికవేత్త అయిన మన్మోహన్‌ సింగ్‌కు అప్పగించిన విషయాన్ని గుర్తుచేశారు. పార్టీని కాపాడేందుకు రాహుల్ గాంధీ వేల కి.మీలు పాదయాత్ర చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ బలహీనపడటంలేదని.. గాంధీ కుటుంబ సభ్యులెవరికీ తాము వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని