Yogi Vs Kejriwal: ‘కేజ్రీవాల్‌ ద్రోహి.. యోగి క్రూరుడు’ : మోదీ ప్రసంగంపై సీఎంల ట్విటర్‌ వార్‌

కరోనా సమయంలో వలస కూలీల తరలింపుపై పార్లమెంట్‌ వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రసంగం తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ

Updated : 08 Feb 2022 10:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కరోనా సమయంలో వలస కూలీల తరలింపుపై పార్లమెంట్‌ వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రసంగం తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రధానిపై ట్విటర్‌లో విమర్శలు గుప్పించారు. అయితే కేజ్రీవాల్‌ విమర్శలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దీటుగా బదులిచ్చారు. దీంతో ఈ ఇద్దరు సీఎంల మధ్య ట్విటర్‌ వార్‌ నడిచింది. అసలేం జరిగిందంటే..

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ... ప్రధాని మోదీ సోమవారం లోక్‌సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో వలసకూలీలు ఎదుర్కొన్న కష్టాలను ప్రస్తావిస్తూ దిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌లకు వెళ్లి అక్కడ కరోనా వ్యాపింపజేసేలా దిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు బలవంతంగా పంపించేశాయని ప్రధాని దుయ్యబట్టారు. 

అయితే ప్రధాని వ్యాఖ్యలపై దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్రంగా మండిపడ్డారు. ‘‘ప్రధాని వ్యాఖ్యలు పచ్చి అబద్ధం. కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న వారి పట్ల, తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి పట్ల ప్రధాని సున్నితంగా ఉంటారని దేశ ప్రజలు భావించారు. కానీ, ప్రజల బాధపై రాజకీయాలు చేయడం ప్రధానికి తగదు’’ అని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. అటు ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా ఇదే విషయాన్ని పేర్కొంటూ ఓ వీడియోను పోస్ట్‌ చేసింది.

యోగి రియాక్షన్‌.. కేజ్రీవాల్‌ రిప్లయ్‌..

కేజ్రీవాల్‌ ట్వీట్‌పై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్పందిస్తూ దిల్లీ ముఖ్యమంత్రిపై విమర్శల వర్షం కురిపించారు. ‘‘వినండి కేజ్రీవాల్‌, ఓవైపు యావత్‌ మానవాళి కరోనా మహమ్మారితో ఇబ్బంది పడుతుంటే.. మీరు యూపీ కార్మికులను బలవంతంగా దిల్లీ నుంచి పంపించారు. మీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అమానవీయ చర్యల వల్ల చిన్న పిల్లలు, మహిళలు కూడా అర్ధరాత్రి యూపీ సరిహద్దుల్లో నిస్సహాయంగా నిలబడాల్సి వచ్చింది. మీరు మానవతాద్రోహి కాక ఇంకేంటీ..?’’ అని ప్రశ్నించారు. కేజ్రీవాల్‌ అబద్ధాల కోరు అని, ప్రధాని పట్ల అగౌరవంగా మాట్లాడిన ఆయన ఈ దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

అయితే యోగి రియాక్షన్‌కు కేజ్రీవాల్‌ కూడా దీటుగా బదులిచ్చారు. ‘‘వినండి యోగి.. యూపీ ప్రజల మృతదేహాలు నదుల్లో తేలుతుంటే.. మీరు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పత్రికల్లో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు. మీరు అలాగే ఉండండి. మీలాంటి దయలేని, క్రూరమైన పాలకుడిని నేనెప్పుడూ చూడలేదు’’ అంటూ కేజ్రీవాల్‌.. యోగిని దుయ్యబట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని