Andhra News: మా పార్టీ పాతిక స్థానాలు గెలవడం కష్టమే

రానున్న ఎన్నికల్లో తమ పార్టీ పాతిక స్థానాల్లో గెలవడమూ కష్టమేనని పందెంరాయుళ్లు పందేలు కాస్తున్నట్లు తెలుస్తోందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

Updated : 18 Feb 2023 09:14 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: రానున్న ఎన్నికల్లో తమ పార్టీ పాతిక స్థానాల్లో గెలవడమూ కష్టమేనని పందెంరాయుళ్లు పందేలు కాస్తున్నట్లు తెలుస్తోందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. తమకు తామే సింహాలమని, వైనాట్‌ 175 అని బీరాలు పోతే ఆ సంఖ్య మరింత తగ్గే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. దిల్లీలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని శాసనసభ స్థానాల్లో ప్రతిపక్ష కూటమి అభ్యర్థులు 30వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారని ఇప్పటికే కొందరు పందేలు కాస్తున్నట్లు తెలిసిందన్నారు. చంద్రబాబు రోడ్‌షోలకు హాజరవుతున్న జనసందోహాన్ని చూసైనా ఆత్మస్తుతి, పరనిందను మాని ప్రజలు ఎందుకు మనకు దూరం అవుతున్నారో ఆత్మావలోకనం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ భూమి పుట్టాక తనలా సంక్షేమ పథకాలు ఎవరూ చేపట్టలేదని చెప్పుకునే జగన్‌.. ప్రకాశం జిల్లా సింగరాయకొండ హాస్టల్‌ విద్యార్థినులు అన్నమో రామచంద్రా అని అడుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అనకాపల్లి జిల్లాలో బాలికల వసతిగృహంలో స్నానాల గదులు లేక బెడ్‌షీట్లు అడ్డుగా కట్టుకొని లైట్లు ఆర్పి వేసి స్నానాలు చేయాల్సిన అగత్యం నెలకొన్నట్లు విద్యార్థినులు రోదిస్తున్నారని తెలిపారు. వారు సమస్యలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియోను ఆయన ప్రదర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని