Pilli Subhash: మంత్రి వేణుకు టికెట్‌ ఇస్తే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా: పిల్లి సుభాష్‌

వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురం టికెట్‌పై వైకాపా సీనియర్‌ నేత, ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Updated : 23 Jul 2023 16:49 IST

రామచంద్రపురం: వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురం టికెట్‌పై వైకాపా సీనియర్‌ నేత, ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు మళ్లీ టికెట్‌ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థి (ఇండిపెండెంట్‌)గా పోటీచేస్తానని స్పష్టం చేశారు. రామచంద్రపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బోస్‌ మాట్లాడారు. 

Pawan Kalyan: జగన్‌.. ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి: పవన్‌

‘‘కార్యకర్తలు, క్యాడర్‌ వద్ద వేణు ఎన్ని రోజులు నటిస్తారు? మమ్మల్ని.. వేణు చెప్పు కింద బతికే వాళ్లం అనుకుంటున్నారా? వైకాపా ఆవిర్భావం నుంచి జగన్‌తోనే ఉన్నాం. వేణు, నన్ను సమావేశపరుస్తానని సీఎం జగన్‌ చెప్పారు. క్యారెక్టర్‌ లేని వ్యక్తితో కూర్చోనని తేల్చి చెప్పాను’’ అని పిల్లి సుభాష్‌ తెలిపారు.

సీఎం జగన్‌ చెప్పినా మెత్తబడని పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌..

కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలోని వైకాపాలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. మంత్రి వేణుపై ఇప్పటికే తిరుగుబావుటా ఎగరవేసిన బోసు వర్గం ఇవాళ మరో అడుగు ముందుకేసింది. ఈ నేపత్యంలోనే రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్‌ రంగంలోకి దిగారు. బహిరంగంగానే మంత్రిపై విమర్శలు చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల వెంకటయ్య పాలెంలో ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ వర్గీయులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చంద్రబోస్‌పై అభిమానంతో మంత్రి వేణును గెలిపించామని, అలాంటిది తమ మీదే రౌడీషీట్ తెరిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కుమారుడు రాజ్యాంగేతర శక్తిగా మారారని, వైకాపాను మంత్రి నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

శెట్టిబలిజలను మంత్రి వేణుగోపాలకృష్ణ అణగదొక్కేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈసారి ఆయనకు టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబోస్ కుటుంబానికి టికెట్ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వైకాపా టికెట్ ఇవ్వకపోయినా,  బోస్ కుమారుడిని గెలిపిస్తామని ఆయన అభిమానులు స్పష్టం చేశారు. రూ.12 కోట్లు ఖర్చు పెట్టానని, డబ్బులిస్తేనే పనులు చేస్తానని మంత్రి చెబుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో పిల్లి సూర్యప్రకాశ్‌కు వైకాపా టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 26 అమలాపురం పర్యటన సందర్భంగా సీఎం జగన్‌ను కలిసి సమస్యలు వివరిస్తామని స్పష్టం చేశారు. సమావేశం జరిగిన మరుసటి రోజే మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ కోలమూరి శివాజీపై మంత్రి వేణుగోపాల కృష్ణ సమక్షంలోనే ఆయన అనుచరులు దాడి చేయడం మరింత అగ్గి రాజేసింది.

ఈ ఘటనతో మనస్తాపానికి గురైన శివాజీ కాసేపటి తర్వాత చీమల మందు నీటిలో కలిపి తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈపరిణామాల నేపథ్యంలో ఎంపీ బోసు ..సీఎం జగన్‌ను కలిసి మంత్రి వేణుపై ఫిర్యాదు చేశారు. సర్దుకుపోవాలని సీఎం జగన్‌ చెప్పినా పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ శాంతించలేదు. ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బహిరంగంగా మంత్రిపై విమర్శలు చేయడంతో వర్గపోరు మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం వైకాపా టికెట్‌ ఎవరికన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని